15-08-2025 12:18:24 AM
-భారీ వర్షాల దృష్ట్యా అధికారులకు ఆదేశం
-వరద ప్రభావిత ఇండోర్ సబ్‌స్టేషన్, షిర్డీ సాయినగర్,
-ఖమ్మం బ్రిడ్జి ప్రాంతాల పరిశీలన
కోదాడ ఆగస్టు 14: భారీ వర్షాల దృష్ట్యా ప్రభుత్వ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని వరద ప్రభావిత ఇండోర్ సబ్-స్టేషన్, షిర్డీ సాయినగర్, ఖమ్మం బ్రిడ్జి ప్రాంతాలను పరిశీలించి మాట్లాడారు. రెండు రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా ఎడతెరప లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు,చెరువులు పూర్తిగా నిండిపోవడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని,శిధిలమైన భవనాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చూడాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పనిసరి అవసరమైతేనే బయటకు రావాలని ప్రజలను కోరారు. మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు సహాయ చర్యలు చేపట్టిన అధికారులు, నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ డైరెక్టర్ శివాజీ, డీఈ రామకృష్ణ, ఏడీఈ వెంకన్న, ఏఈ నర్సింహారావు, మునిసిపల్ కమిషనర్ రమాదేవి, డీఈ లక్ష్మి, పట్టణ సీఐ శివశంకర్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.