18-11-2025 12:00:00 AM
ఎమ్మెల్యే జారే వెల్లడి
ములకలపల్లి / దమ్మపేట,నవంబరు 17 (విజయక్రాంతి):అశ్వరావుపేట నియోజకవర్గానికి మరో రెండు కొత్త 33/11 కెవి విద్యుత్తు ఉప కేంద్రాలు మంజూరైనట్లు అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెల్లడించారు. సోమవారం ఆయన దమ్మపేట మండలంలోని గండు గులపల్లి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దమ్మపేట మండలంలోని మల్లారం, జగ్గారం గ్రామాల్లో విద్యుత్ ఉప కేంద్రాల నిర్మాణం కోసం 5కోట్ల 27 లక్షల 82 వేల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ సమస్య పరిష్కారం కోసం దమ్మపేట మండలంలోని మల్లారం ,జగ్గారం గ్రామాల్లో 33/11 కెవి సబ్ స్టేషన్లను మంజూరు చేయించినట్లు చెప్పారు. వీటి నిర్మాణం పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు ముఖ్యంగా రైతులకు విద్యుత్ పరంగా ఉన్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలియజేశారు.
నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానుందని సమస్యను ప్రభుత్వానికి విన్నవించడంతో విద్యుత్ ఉప కేంద్రాలను మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉపముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు, ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల అధ్యక్షులు సత్యప్రసాద్,మాజీ సర్పంచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.