30-10-2025 12:01:11 AM
తగ్గేదేలే అంటున్న ఇసుక మాఫియా
ధర్మపురి, అక్టోబర్29 (విజయక్రాంతి): ఎండపల్లి మండలంలో ఇసుక మాఫియా ద మ్ముంటే పట్టుకోండి అన్నట్లు అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఒకపక్క అధికారులు ఇసుక ట్రాక్టర్లను, ఇసుక డంపులను సీజ్ చేసి అపరాధ రుసుములు విధిస్తున్నప్పటికీ ఇసుక అక్రమార్కులు మాత్రం ఏమాత్రం తగ్గేదేలేదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. బుధవారం సైతం పట్టపగలే ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా ను కొనసాగించారు. ఇసుక మాఫియా అక్రమార్కుల ఆగడాలకు చెక్ పెట్టలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
రవాణా రూట్ చేంజ్!
ఇంతకాలం ఎండపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నుండి రవాణా కొనసాగించిన ఇసుక మాఫియా ఇప్పుడు ఇసుక రవాణా రూట్ ను చేంజ్ చేశారు. అంతర్గామ్ మండలకేంద్రం నుండి వస్తున్న ఇసుక ట్రాక్ట్రర్లు ఎండపల్లి మండలం శానబండ, గోడిసెలపేట గ్రామాల మీదుగా వెల్గటూర్ మండలంలోనికి ప్రవేశిస్తున్నాయి. మా గ్రామాల మీదుగా రాత్రింబవళ్ళు ఇసుక రవాణతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నమనీ అధికారులు ఇసుక రవాణకు అడ్డుకట్టవేయాలనీకోరుతున్నారు.