30-10-2025 12:01:52 AM
నేలకొరిగి నీట మునిగిన వరి పైరు
హుజూర్ నగర్, అక్టోబర్ 29 : మెంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హుజూర్ నగర్ నియోజకవర్గం లోని అనేక గ్రామాలలో వందల ఎకరాలలో వరి పైరు నేలకొరిగి నీట మునిగింది. వరి కంకి పాలు పోసుకొని ధాన్యంగా తయారు కాబోతున్న ఈ కీలక దశలో వరి పొలాలు నేలకొరిగి నీట మునగడం తో రైతన్న వెన్నుపూస విరిగినట్లు అయింది.
హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు గ్రామా లలో గల చెరువులు, బావులు, వాగులు, వంకలు, బోర్లు అన్ని నీటితో నిండి ఏ క్షణానైనా కట్టెలు తెంచుకునే ప్రమాదాన్ని పొంచి ఉన్నాయి.దీంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది.బుధవారం చింతలపాలెం, మఠంపల్లి, నేరేడుచర్ల, హుజూర్ నగర్ మండలంలోని గోపాలపురం, బూరుగడ్డ, అమరవరం, వేపలసింగారం, లింగగిరి తదితర గ్రామాల్లో తుఫాన్ ప్రభావంతో పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవడంతో ఆకాశంలో మబ్బులు వస్తుండడంతో ఎక్కడ తమ వరి పైరు కింద పడిపోతుందో వర్షపు వరదలకు కొట్టుకుపోతుందో అన్న భయం రైతులను వెంటాడుతోంది.
చేతి కాడికి వచ్చిన పంట నోటి దాకా రాదేమోనన్న భయం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావం మరో రెండు మూడు రోజులు ఉంటుందన్న వార్త కథనాలతో రైతులు హడలిపోతున్నారు. మరికొంత ఏరియాలో వరి కోతలు కోసేందుకు సిద్ధంగా ఉండడంతో తుఫాన్ అలెర్ట్ రైతులు కోతలను నిలిపివేశారు.
వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీదు చేసిన ధాన్యాన్ని కాంట వేయించి వెంటనే తరలించే విధంగా ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలలో వివిధ గ్రామాలలో ఎంత మేరకు వరి పంట నష్టం, నివాస గృహాలకు నష్టం వాటిల్లింది అనే సమాచారం అధికారుల నుంచి తెయాల్సి ఉంది.
వందల ఎకరాల పంట నష్టం వాటిల్లింది
బూరుగడ్డ గ్రామ రెవెన్యూ పరిధిలో గోపాలపురం గ్రామంలో మాకు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేశాను. వరి పంట నిండు పొట్ట దశలో ఉండి వరికంకి పాలు పోసుకొని ధాన్యంగా మారే కీలక దశలో వరి పొలాలు నేలకొరిగి నీట మునగడంతో రైతన్న వెన్నుపూస విరిగినట్లు అయింది మెంథా తుపాను కారణం వల్ల మా గ్రామంలో కొన్ని వందల ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మాకు పంట సహాయం అందించాలని వేడుకుంటున్నాం.
- కాల్వ రమేష్, గోపాలపురం గ్రామ రైతు హుజూర్ నగర్ మండలం
ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి
అల్లీపురం గ్రామ రెవెన్యూ పరిధిలో మాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేశాను. వరి పంట నిండు పొట్ట దశలో వరి పొలాలు నేలకొరిగి నీట మునగడంతో రైతులు అరి గోసపడుతున్నారు. తుపాను కారణం వల్ల మా తండాలలో వరి పంట నేలకొరిగి నీట మునిగి పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము.
- బానోతు చంద్రు నాయక్...కొత్త దొనబండతండా గ్రామ రైతు మఠంపల్లి మండలం