calender_icon.png 1 May, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి నది పుష్కర పనులను వెంటనే పూర్తి చేయాలి

30-04-2025 05:42:26 PM

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు...

మహదేవపూర్ (విజయక్రాంతి): రాబోయే సరస్వతి పుష్కర మహోత్సవాలను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు సమయానుకూలంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) అధికారులను ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో బుధవారం రాబోయే సరస్వతి పుష్కరాల పనులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి కాళేశ్వరంలో విఐపి ఘాట్, గోదావరి ఘాట్, 100 గదుల సత్రం, వైద్యశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గోదావరిలో వ్యర్దాలు తొలగించి పరిశుభ్రం చేయాలని సూచించారు. 

సమయం చాలా తక్కువగా ఉందని, ఆశించిన స్థాయిలో ఇప్పటి వరకు పనులు జరగలేదని అధికారులు గుర్తించి నిర్దిష్ట కార్యాచరణతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అవసరమైన సదుపాయాలను త్వరితగతిన అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. మే 15 నుండి 26 తేదీ వరకు జరిగే సరస్వతి పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉన్నందున, అన్ని విభాగాలు అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి స్పష్టం చేశారు.

పనులు వేగవంతం చేసేందుకు కూలీలను పెంచాలని సూచించారు. పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మహదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, ఈవో మహేష్, పంచాయతి రాజ్, ఇరిగేషన్, ఆర్ డబ్ల్యూఎస్, వైద్య, దేవాదాయ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.