calender_icon.png 23 December, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందాలతో సర్పంచ్ ఎన్నిక

23-12-2025 02:00:33 AM

ఆదర్శం మునిపంపుల గ్రామం

గడగోజు రవీంద్రాచారి (విజయక్రాంతి) : ప్రలోభాలను తిరస్కరించిన ప్రజలు, చందాలు వేసుకుని తమ కోసం పనిచేసే వ్యక్తిని సర్పంచ్‌గా ఎన్నుకున్నారు. ఎన్నికలు అంటే డబ్బు, మద్యం, ప్రలోభాలు తప్పవన్న భావనను వారు చెరిపేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామం అరుదైన ప్రజాస్వామ్య తీర్పు చెప్పింది. నోట్లు లేకుండా, మద్యం పంచకుండా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ప్రజలే ఖర్చులు భరించి, ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన యువకుడు, నిజాయతీ గల వ్యక్తిని తమ గ్రామ ప్రథమ పౌరుడి ఎన్నుకున్నారు.

సర్పంచ్‌గా ఎన్నికైన బొడ్డుపల్లి వెంకటేశం రాజకీయ వారసత్వం గల నాయకుడు కాదు. ధనబలం, అధికార అండలు లేని కార్యకర్త. యువకుడు, విద్యావంతుడు. విద్యార్థి ఉద్యమాల నుంచే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితుడై, గ్రామ సమస్యలపై నిరంతరం పోరాడాడు.

తాగునీరు, ఉపాధి, రహదారులు, వైద్యం, విద్యార్థి, యువకుల, సంక్షేమ పథకాలు, అమలు వంటి అంశాలపై ఆయన సాగించిన నిరంతర పోరాటాలు గ్రామ ప్రజలకు తెలిసినవే. దీంతో గ్రామస్థులే ఇంటింటా చందాలు వేసుకుని, ప్రచారం చేశారు. కార్యకర్తలకు అన్నదానం చేశారు. వారి శ్రమ వృథా కాకుండా మునిపంపుల సర్పంచ్‌గా వెంకటేశం ఎన్నికయ్యాడు.