08-07-2025 01:10:33 AM
రాష్ట్ర ఎమ్మార్పీఎస్ (టిజి) కన్వీనర్ డాక్టర్ మీసాల మల్లేష్
ఘట్ కేసర్, జూలై 7 : ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు శ్రమ ఫలితంగా ఎస్సీ వర్గీకరణ జరిగిందని రాష్ట్ర ఎమ్మార్పీఎస్ (టిజి) కన్వీనర్ డాక్టర్ మీసాల మ ల్లేష్ అన్నారు. ఘట్కేసర్ పట్టణంలో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ మేడ్చల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక మాజీ కౌన్సిలర్ కడపోల్ల మల్లేష్ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు డాక్టర్ మల్లేష్ ముఖ్యఅతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దేశంలో మొట్ట మొదటగా ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింప చేశారని పేర్కొన్నారు. మాదిగలకు 9 శాతం, మాలలకు 5శాతం మరియు అత్యంత వెనుకబడిన ఎస్సీలకు ఒక శాతం మొత్తం మూడు గ్రూపులుగా చేసి ఎస్సీలను వర్గీకరించినట్లు చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డికి మాదిగలు ఎప్పటికీ రుణపడి ఉంటారన్నారు. రాజకీయాలలో కూడా ఎస్సీల వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్. నర్సింగ్ రావు, ఎన్. శ్రీనివాస్, జి. ఆంజనేయులు, సిహెచ్ రవి, టి. బాలయ్య, బి. రాందాస్, లాజర్, మహిపాల్, బాలయ్య, నవీన్, నర్సింగ్ రావు, ఎం. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.