calender_icon.png 24 May, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదిగలకు మంత్రివర్గంలో చోటివ్వాలి

24-05-2025 12:43:28 AM

సీఎం రేవంత్‌రెడ్డికి మంచిపేరు వస్తుంటే..

బీఆర్‌ఎస్, బీజేపీ ఓర్చుకోవడం లేదు

ఈడీ కేసుల పేరుతో వేధిస్తే చూస్తూ ఊరుకోం

ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హెచ్చరిక

మంత్రి దామోదర, కడియం శ్రీహరిలది మాదిగ ఉపకులం

ఎమ్మెల్యే మందుల సామేల్

హైదరాబాద్,(విజయక్రాంతి): మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. అన్నింట్లో ముందుండి పోరాడుతున్న మాదిగలకు న్యాయం జరగాలన్నారు. మాల సామాజికవర్గాన్ని కూడా తాము గౌరవిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ చార్జ్‌షిట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పేరుందని బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు హడావుడి చేస్తున్నారని, పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. విపక్ష పారీలపై కేంద్రం ఈడీని ప్రయోగిస్తోందని, ప్రశ్నించే వారిని  వేధింపులకు గురిచేస్తుందని మండిపడ్డారు. ఈడీని అడ్డంపెట్టుకొని వేధిస్తే, కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని ఆయన హెచ్చరించారు.

సీఎం రేవంత్‌రెడ్డికి మంచిపేరు వస్తుందనే భయంతోనే బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కుట్రలు చేస్తున్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నాయకులు బీజేపీకి దగ్గరుండి ఓట్లు వేయించారని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలోనూ బీజేపీని కేసీఆర్ ఒక్క మాట అనలేదన్నారు. తుంగతూర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ మంత్రి దామోదర రాజనరసింహ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిగలు కారని, వారిది మాదిగ ఉప కులమని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 33 లక్షల మంది మాదిగలు ఉన్నారని తెలిపారు. మాలలకు డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవి ఇచ్చారని, మాదిగలకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ పెద్దలను కలిసి కోరామని ఆయన గుర్తు చేశారు.