calender_icon.png 29 January, 2026 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ బస్సు బోల్తా

29-01-2026 12:16:25 AM

17 మంది విద్యార్థులకు గాయాలు.. తప్పిన పెను ప్రమాదం!

మొయినాబాద్, జనవరి 28: మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని మృగవని పార్కు సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. స్కూల్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 17 మంది విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితుల వివరాల ప్రకారం  బండ్లగూడ జాగీర్లోని ‘హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్’ పాఠశాలకు చెందిన విద్యార్థులు, అజీజ్ నగర్లోని చాందినీ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న స్కూల్ వార్షికోత్సవ స్టేజ్ ప్రాక్టీస్ ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మృగవని పార్కు వద్దకు రాగానే బస్సు టైర్ పంక్చర్ అయినట్లు శబ్దం రావడంతో డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశారు. ఇదే సమయం లో బస్సు అదుపుతప్పి రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 25 మంది విద్యార్థులు ఉండగా, వారిలో 17 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే108 వైద్య సిబ్బంది, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్ కుమార్, సీఐ పవన్ కుమార్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్లలో వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. విద్యార్థులు క్షేమంగా బయటపడటంతో తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు.