29-01-2026 12:15:26 AM
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం, జనవరి 28, (విజయక్రాంతి) : ప్రస్తుత వ్యవసాయ విధానాలలో మార్పులు చోటు చేసుకోవడం వలన గిరిజన రైతులకు ఆశించినంత ఆదాయం సమకూరడం లేదని, మారుతున్న కాలాన్ని బట్టి ప్రత్యామ్నాయ పంటలు వేసుకుని బి ఆర్ ఎల్ ఎఫ్ స్వయం ప్రతిపత్తి సంస్థ సభ్యుల సలహాలు సూచనలు పాటించి ఆదాయ మార్గాలు పెంచుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
బుధవారం నాడు దుమ్ముగూడెం మండలంలోని కోయ నర్సాపురం, దబ్బా నూతల, పాత నారాయణరావుపేట గ్రామాలలో భారత రూరల్ లవ్లీ హుడ్స్ ఫౌండేషన్ భారత ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్థాపించబడిన స్వయం ప్రతిపత్తి సంస్థ, ఫోకస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా సెంటర్ పవర్ పీపుల్స్ ఫారెస్ట్రీ సంస్థ సభ్యులు దుమ్ముగూడెం మండలంలోని గిరిజన గ్రామాలలో రైతులకు పలు సూచనలు సలహాలు ఇస్తూ పంటలు పండించుకోవడం, చేపల పెంపకం, ఇంకుడు గుంతల నిర్మాణం, న్యూట్రి గార్డెన్ మరియు గ్రామాలలోని రైతులకు అందిస్తున్న సేవలు గురించి క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి రైతులకు పలు సూచనలు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు సంస్థ సభ్యులు అందిస్తున్న సలహాలు సూచనలు పాటించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వ్యవసాయం చేసుకోవాలని అన్నారు. సీజన్ ను బట్టి పంటలు వేసుకోవాలని, గిరిజన రైతులు ఎక్కువ శాతం ఆర్గానిక్ పంటలపైనే దృష్టి సారించి పండ్లు, కూరగాయలు, మునగ చెట్ల పెంపకం, చేపల పెంపకం వంటి జీవనోపాధికి సంబంధించిన వాటి మీదనే మక్కువ చూపాలని ఆయన అన్నారు.
గిరిజన రైతులకు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టం విధానం ద్వారా పలు ఆదాయ వనరులు సమకూరుతాయని రైతులకు సూచించారు. అనంతరం ఆయా గ్రామాలలోని గిరిజన రైతుల సమస్యలను నేరుగా తెలుసుకొని ఈ ప్రాజెక్టు ద్వారా అందే సేవలను సద్వినియోగం చేసుకుంటూ స్వయం సమృద్ధి దిశగా ప్రణాళికల రూపొందించుకొని పంటలు పుష్కలంగా పండించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎల్ ఎఫ్ టీమ్ లీడర్ ఎప్పుడు వస్తా రు రాజ్ కృపాల్, ఆర్గనైజర్ నీరజ్, సంస్థ బృందం సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.