calender_icon.png 24 October, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయులతో బడుల తనిఖీలు సరైంది కాదు

23-10-2025 07:54:17 PM

దౌల్తాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 24, 246 ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను బడుల తనిఖీలకు నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని టిపిటిఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి తెలిపారు. దౌల్తాబాద్ మండల టిపిటిఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యా పర్యవేక్షణను మండల విద్యాధికారులు, జిల్లా ఉపవిద్యాధికారుల ద్వారా నిర్వహించాలని కోరారు. పిఆర్సీని జూలై 2023 నుండి అమలు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాల పారిశుద్ధ్య కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు రాకపోవడం దారుణమని, కలెక్టరు వెంటనే చెల్లింపులు చేయాలని కోరారు.పెండింగ్ బిల్లులు, ప్రమోషన్లు, ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయుల నియామకం రిటైర్మెంట్ బకాయిల చెల్లింపులు వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి శ్రీధర్ జిల్లా కౌన్సిలర్ వెంకటేశం, పరశురాములు, సంజీవ గౌడ్, విజయ కృష్ణ, కృష్ణ, మల్లేశం,విష్ణు, దశరథం వివిధ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.