24-10-2025 12:32:24 AM
హనుమకొండ, అక్టోబర్ 23 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో జోక్యం చేసుకోవాలని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. హనుమకొండ హరిత కాకతీయ హోటల్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో లేఖను విడుదల చేసి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్న బిల్లుపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తమిళనాడు తరహాలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో 69 శాతం రిజర్వేషన్లని చట్టబద్ధం చేసి తొమ్మిదవ షెడ్యూల్ లో చేర్చిన విధంగానే తెలంగాణ స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో కూడా ప్రధానిగా మీరు జోక్యం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభు త్వం కూడా 42 శాతం రిజర్వేషన్లను సాధించటానికి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని రిజర్వేషన్ల కోసం పార్లమెంటును వేదికగా చేసుకొని పోరాడి రిజర్వేషన్లను సాధించాలని అభిప్రాయపడ్డారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తరు వాత రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటకూడదనే నిబంధనకి అర్థం లేదు కాబట్టి 50 శాతం పరిమితిని ఎత్తివేసి బీసీ రిజర్వేషన్ల పెంపుకు సహకరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు ధారబోయిన సతీష్, ఎదునూరి రాజమౌళి, ఎంబీసీ నాయకులు డాక్టర్ పాలడుగుల సురేందర్, కాకతీయ యూనివర్సిటీ బీసీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ గడ్డం కృష్ణయ్య, డాక్టర్ ఎర్ర బొజ్జు రమేష్, బుట్టి శ్యామ్ యాదవ్, సోమిడి అంజన్ రావు, చిన్నాల యశ్వంత్ యాదవ్, దామెరకొండ కొమరయ్య, వేణు చారి, డేనియల్ తదితరులు పాల్గొన్నారు.