23-10-2025 12:00:00 AM
- ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
-సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కాలేజీలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే
అబ్దుల్లాపూర్ మెట్, అక్టోబర్ 22: విద్యాలయాలు దేవాలయాల లాంటివని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. సంజయ్ గాంధీ మెమోరి యల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నాగముని నాయక్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని ఒప్పించి పేద విద్యార్థుల కోసం ఈ కళాశాల నిర్మించామని అన్నారు. ఈ కళాశాలపై తనకు ప్రత్యేకమైన మమకారం ఉందని తెలిపారు. తాను ఏ ఉద్దేశంతో అయితే పేద విద్యార్థుల కోసం కళాశాలను నిర్మించామో ఈ రోజు గ్రాడ్యుయేషన్ డే లో విద్యార్థులను చూస్తే ఎంతో ఆనందమైందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి ఫ్యూచర్ సిటీలో నిర్మించబోయే విద్యాలయాలు ప్రపంచంలో ఇక్కడ లేని విధంగా అన్ని కోర్సులు ఉండేలా అద్భుతమైన కళాశాలను నిర్మిస్తామని అన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ నాగముని నాయక్ మాట్లాడుతూ తమ కళాశాల తరఫున గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా ఎమ్మెల్యే ప్రత్యేక మమకారంతో తమ కళాశాల నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కావడం ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సిహె భాస్కరచారి, బాటసింగారం సహకార బ్యాంకు చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర మహేందర్ గౌడ్, బింగీ దేవదాస్ గౌడ్, రమేష్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు గౌసు పాష, దేవుడి వేణుగోపాల్ రెడ్డి, గంట లక్ష్మారెడ్డి, కోట ప్రభాకర్ రెడ్డి, కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.