calender_icon.png 24 October, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నత్త చూస్తే నవ్విపోదా..!

24-10-2025 12:45:29 AM

- అన్నదాత అరిగోస..

- రోజుల తరబడి కేంద్రాల్లోనే నిరీక్షణ

- కొర్రీల పేరుతో కొనుగోళ్లలో జాప్యం

- ఉన్నతాధికారుల చోద్యం

నల్లగొండ, అక్టోబర్ 23(విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతలు తమ పంటను అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నారు. వడ్లు మొలక పోసిన దగ్గరి నుంచి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మి.. మిల్లులో దిగుమతి అయ్యే దాకి అన్నదాతది ఊరికొయ్య మీద ఊగిసలాటే అయ్యింది. ప్రకృతి వైపరీత్యాలు.. మానవ తప్పిదాలు.. కారణం ఏదైనా అన్నదాతకు మాత్రం అంతులేని విషాదం మిగులుతోందనే చెప్పాలి. పాలకుల విధానాలకు తోడు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం తోడవ్వడంతో రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది.

అవకాశం చిక్కితే.. అన్నదాతలను తమ భుజస్కంధాలపై మోస్తున్నామంటూ ఊకదంపుడు ప్రసంగాలిచ్చే ప్రజాప్రతినిధులు వారిని ఒక ప్రచార అస్త్రంగానే చూస్తున్నారు. ఎవరెన్నీ చెప్పినా.. ‘మేం ఊకుంటం.. లేకుంటే వైకుఠం’ అన్న చందంగా పాలకుల పరిస్థితి మారింది. ఫలితంగా అన్నదాతకు అష్టదిక్కుల నుంచి కష్టాలు చుట్టుముడుతున్నాయి. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే వడ్ల రాశులతో పడిగాపులు కాస్తున్నా.. ఇటు పాలకులు గానీ.. అటు అధికారులు గానీ పలకరించిన పాపాన పోలేదనే చెప్పాలి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం కారణంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న కష్టాలపై ‘విజయక్రాంతి’ స్పెషల్ స్టోరీ.

కంటి మీద కునుకు లేకుండా..

గత కొద్ది రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అకాల వర్షాలు అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఐకేపీ, పీఏసీఎస్, మార్కెట్ యార్డుల్లో తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను చేపట్టింది. కానీ ఇప్పటివరకు ఏ మార్కెట్ యార్డుల్లోనూ పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోలేదు. వాస్తవానికి తెలంగాణ రాష్ర్టం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై పూర్తిస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడ డంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా మారింది.

వడ్లు అమ్మేందుకు మార్కెట్‌కు వచ్చిన అన్నదాతను తేమ, నాణ్యత ప్రమాణాల పేరుతో రకరకాల కొర్రీలు పెడుతూ ధాన్యం కొనుగోలు చేయకుండా రోజులు దాటవేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించినా.. బదులిచ్చేవారు కరువయ్యారు. సకాలంలో పంటను కొనుగోలు చేయకుండా.. నిర్వాహకులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నా రంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే రాష్ర్ట ప్రభుత్వం.. కేంద్రాల్లో అన్నదాతలకు ఎదురవుతోన్న సమస్యలను తక్షణమే పరిష్కరి చాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి.

అకాల వర్షం.. తీరని నష్టం..

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా చేతికి అందివచ్చిన ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే.. ఇక్కడ కొర్రీలు పెట్టి కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చేశారు. ఫలితంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా వేల క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్ధయ్యింది. మళ్లీ అధికారులు ధాన్యం తడిసినందుకు క్వింటాలుకు ఎంత కోత విధిస్తారోనని రైతాంగం ఆందోళన చెందుతోంది.

నల్లగొండ, చిట్యాల, నకిరేకల్, కట్టంగూరు ప్రాంతాలతో పాటు యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లాలో అకాల వర్షం ధాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వర్షపు నీరు చేరింది. వాస్తవానికి ఒక్కో రైతు ధాన్యం తీసుకొచ్చిన నెల రోజుల వరకు కాంటాలు కావడం లేదు. వాస్తవానికి ప్రతి సీజనులో ధాన్యం కొనుగోళ్ల విషయంలో మిల్లర్లు పేచీ పెడుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం గానీ అధికారులు గానీ మిల్లర్ల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం చూపలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రోజుకు పట్టాల ఖర్చే రూ.300

నాకున్న మూడెకరాల్లో వరిపంట సాగు చేశాను. దాదాపు 15 రోజుల క్రితం వడ్లు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. ఇప్పటివరకు ధాన్యం కాంటాలు వేయడం లేదు. రెండు మూడు రోజులకోసారి కాంటా వేస్తున్నారు. ఓవైపు వర్షాలు ఎప్పుడు పడుతున్నాయో తెలియడం లేదు. దీంతో వడ్లపై కప్పేందుకు పట్టాలకు రోజుకు రూ.300 ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటికే 10 రోజులు దాటడంతో పట్టాల కోసమే రూ.3వేలకు పైగా ఖర్చు పెట్టా. ధాన్యం కాంటాలు ఇప్పట్లో అయ్యేలా లేదు.

 యాదయ్య, రైతు, నల్లగొండ