04-10-2025 05:10:01 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
వెంటనే పనులు చేపట్టాలని అధికారుకు ఆదేశాలు
బెల్లంపల్లి (విజయక్రాంతి): త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎన్నికల నిర్వహణ కొరకు బెల్లంపల్లి పట్టణంలో స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు కొరకు సీవోఈ, జిల్లా ప్రజా పరిషత్ బజార్ ఏరియా పాఠశాలలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి శనివారం పరిశీలించారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర సీవోఈ కళాశాలను, బజార్ ఏరియా ఉన్నత పాఠశాలలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుకు సీవోఈ పాఠశాల భద్రతపరంగా ఎంతో సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. బజార్ ఏరియా ఉన్నత పాఠశాలలో ఎన్నికల కోడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కుడా ఏర్పాటు చేయాలని అధికారును ఆదేశించారు. అంతే కాకుండా బెల్లంపల్లి డివిజన్ లోని బెల్లంపల్లి, తాండూర్, నెన్నెల, భీమిని, కాసిపేట, కన్నెపల్లి, మండలాలతో పాటు మంచిర్యాల డివిజన్ లో గల మందమర్రి మండలానికి సంబంధించిన కౌంటింగ్ కేంద్రాన్ని కూడా బెల్లంపల్లిలోనే ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన భద్రత ఏర్పాట్లను ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల తరగతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాటుకు అధికారులు పాఠశాలల హెడ్మాస్టర్లు సహకరించాలని కోరారు. ఈ విషయంపై ఎవరైనా అధికారులు లేదా సిబ్బంది నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని అవసరమైతే వారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలోని లక్షెట్టిపేటలో జన్నారం, దండేపల్లి, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అంతేకాకుండా చెన్నూరులో, జైపూర్, చెన్నూరు వేమనపల్లి, కోటపల్లి మండలాల కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ల ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందుకు సంసంబంధించిన పనులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూములలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్, బెల్లంపల్లి రూరల్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్లు హనూక్, శ్రీనివాస రావు, బెల్లంపల్లి ఎంపీడీవో ఎం. మహేందర్, ఎంపీఓ శ్రీనివాస్, పాఠశాలల హెడ్ మాష్టర్లు ఆకిడి విజయసాగర్, జీ రఘు బాబు, ఎస్సైలు రామకృష్ణ, రాకేష్ తదితరులు ఉన్నారు.