calender_icon.png 18 August, 2025 | 8:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శిల్పకళ అడ్డా.. బూరుగడ్డ

11-12-2024 12:00:00 AM

కాకతీయుల శిల్పకళా సౌందర్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. వీరి హయాంలో ఎన్నో శివాలయాలు నిర్మించబడ్డాయి. అందులో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో బూరుగడ్డ ఒకటి. 24 అడుగుల భారీ అనంత పద్మనాభుడి విగ్రహం, ఒకే పీఠంపై ముగ్గురు దేవతా మూర్తులు, పారిజాత పుష్పం, నక్షత్రతాబేళ్లు, అద్భుత నిర్మాణ సంపద.. ఇలా బూరుగడ్డకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. 

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలంలో బూరుగడ్డ ఉంది. ఇది దక్షిణభారతంలో అతిపెద్ద ప్రాచీ న వైష్ణవాలయం. శాల్మలీకంద ఆదివరాహ, వేణుగోపాల, లక్ష్మీ నర్సింహస్వామి విగ్రహాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఈ గుడి శిలలపై ద్రవిడం, కన్నడం, తమిళం, మలయాళ నాలుగు భాషలు రాసి ఉన్నాయి. అలాగే ఆలయానికి ఎడమ వైపున 24 అడుగుల అనంతపద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం ఉంది. ఇది అచ్చం కేరళలోని అనంతపద్మనాభుడి విగ్రహం మాదిరిగా ఉంటుంది.

ఎనిమిది గజాల పొడవు ఉన్న ఈ ఏకశిలా విగ్రహం దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేదు. అయితే ఈ శిలను ఆకుపాముల ప్రాంతం నుంచి తెప్పించి అనంత పద్మనాభుడిగా చెక్కించారని చరిత్రకారుల ద్వారా తెలుస్తుంది. 

మూడు శాసనాలు

బూరుగడ్డలో మూడు శాసనాలు ఉన్నా యి. వీటిలో ఆలయ ఆవరణలోని శిలాస్తంభంపై రెండు శాసనాలు  ఉండగా, దేవాల య ధ్వంజస్తంభంపై మరో శాసనం ఉంది. మొదటిదానిపై ఆలయం నిర్మించినవారి పేరుంది. మిగిలిన భాగం చెదిరిపోయి గుర్తించలేనివిధంగా ఉంది. ఈ శాసనంపై త్రిభువనమల్ల చాళక్య అనే పేరు లిఖించబడి ఉంది. వాస్తవికంగా త్రిభువనమల్ల చాళక్య అనే రాజు క్రీస్తుశకం 1075 నుంచి 1124 వరకు పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.

ఈయన కర్నాటక రాష్ట్రంలోని బీధర్ జిల్లా కళ్యాణిని రాజధానిగా చేసుకుని దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించాడు. అయితే ఈయన వద్ద ప్రధానమంత్రి అనంత పాల దండనాయకుడు. ఈయన మేనల్లుడే గోపా ల దండనాయకుడు. ఈ గుడిని గోపాల దండనాయకుడే కట్టించాడని శాసనంలో రాసి ఉంది. అయితే వాస్తవికంగా వీరు రాజులుకాదు బ్రాహ్మణులు అని శాసనం ద్వారా అర్థమవుతుంది. వీరు మధ్యదేశం నుంచి వచ్చినట్లు తెలుస్తున్నది. దీనినే ప్రస్తు తం మధ్యప్రదేశ్‌గా పిలుచుకుంటున్నాం.

అయితే ఆయన మేనమామ అనంతపాల దండనాయకుడు రెండు రాష్ట్రాలను పాలన బాధ్యతలు నిర్వర్తించేవారట. ఈ రెండు రాష్ట్రాలను పరిపాలించే అనంతపాలుడికి మేనల్లుడు గోపాల దండనాయకుడు ప్రజల సుఖ సంతోషాల కోసం ఆలయం నిర్మించినట్టు శాసనంలో రాసి ఉంది. ఇక రెండో శాసనం కూడా చాలా ముఖ్యమైంది. వరంగల్ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమదేవి పేరే శాసనంపై రుద్రదేవ మహరాజుగా లిఖించబడి ఉంది. ఆమె కింద ప్రధాన మంత్రి సత్రం బొల్లంరాజు ఆయనకు చిన్న తమ్ముడు దేవకి పుత్రదాసు గోపినాథ దేవాలయం కట్టించాడు.

ఆయనకు ఇద్దరు భార్య లు. అయితే ఈ శాసనంపై బిరాట్టులు అనే పదం ఉంది. ఇది ఏ భాషకు చెందిన పద మో, దాని అర్థం ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ శాసనం పూర్తిగా చదివిన పిదప దానికి అర్థం భార్యలు అనుకోవచ్చని చరిత్రకారుల ద్వారా తెలుస్తుంది. అందుకే శ్రీదేవి, భూదేవి విగ్రహాలను ప్రతిష్ఠించినట్టు ఉంది. ధ్వజ స్తంభంపైగల మరో శాసనంలో బండ్ల రుద్ర అనే పేరుపై గానుగ దానం చేసినట్లు ఉంది. ఆలయంలో దీపాలు వెలిగిం చేందుకు అవసరమైన నూనె తయారీకి దీనిని ఉపయోగించేవారని తెలుస్తోంది.

చెన్నగోపీనాథుని కోసం ఆలయం

బూరుగడ్డలో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం చెన్న గోపీనాథుని కోసం నిర్మించారు. కాగా చెన్నగోపీనాథుని విగ్రహాన్ని కాకతీయుల కాలంలో కర్నాటక రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు. ఆలయ నిర్మా ణ సమయంలో తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు చెన్నగోపీనాథుని విగ్రహాన్ని తీసుకెళ్లి ధ్వంసం చేశారు. దీంతో ఈ ఆలయంలో శ్రీఆదివరాహా లక్ష్మీనర్సింహ, వేణు గోపాలస్వామి వార్లను ప్రతిష్ఠించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాగా ఆలయంలోని శిలా శాసనంలో మాత్రం ఈ మందిరాన్ని చెన్నగోపీనాథుని మందిరంగా లిఖించడం గమనార్హం.

వందల ఎకరాల మాన్యం

ఈ దేవాలయానికి సంబంధించి హుజూర్‌నగర్, గోపాలపురం గ్రామాల పరిధిలో సుమారు 562 ఎకరాల మాన్యం భూము లు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ భూములకు సం బంధించి ప్రతి ఏటా  ఆలయానికి కౌలు చెల్లించడంతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ భూములు 330 మంది కౌలు దారులు చేతుల్లో ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. 

పర్యాటక ప్రాంతంగా గుర్తించాలి

బూరుగడ్డ ఆలయం ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా. గొప్ప శిల్పాకళ నైపుణ్యానికి నిలయం. మనదేశంలోని చాలామంది పర్యాటకులు ఇక్కడకు ప్రత్యేకంగా వస్తుంటారు. అందుకు కారణంగా ఈ ఆలయ నిర్మాణమే. అయితే హుజూర్‌నగర్ వచ్చేక్రమంలో రవాణా ఇబ్బందులున్నాయి. దాంతో పర్యాటకులు రాలేకపోతున్నారు. పర్యాటకశాఖ బూరుగడ్డను పర్యాటకంగా ప్రాంతంగా గుర్తిస్తే మరింత అభివృద్ధి అవుతుంది. 

- కుక్కడపు శ్రీనివాస్, సూర్యాపేట

హు కోటేశ్వర్‌రావు, సుధాకర్

(సూర్యాపేట/హుజూర్‌నగర్)