11-12-2024 12:00:00 AM
ఎవరి పేరు వింటే 12 మెట్ల కిన్నెర పరవశించిపోతుందో.. ఎవరి గొంతు వింటే ప్రకృతి పరశించిపోయి కమ్మని రాగాలు ఒలికిస్తుందో అలాంటి గానానికి నిదర్శనమే కిన్నెర మొగులయ్య. కిన్నెర వాయిద్యంతో తెలంగాణ యాస, భాష, పాటకు ప్రతిరూపంగా నిలుస్తూ అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. తాత ముత్తాతల నుంచి కిన్నెర పాటను ఒంటిపట్టించుకున్నడు. మొగులయ్య హద్దులేని పల్లె పాటల బాటసారి. బతుకు బాటలో సంచార జీవి. పల్లె పల్లె తిరుగతూ జనం నోళ్లల్లో పాటై నిలిచిండు.
మీసం మెలేసి వీరగాథలు చెబుతుంటే వినేవారి రోమాలు నిక్క పొడిచేవి. ఆయన చెప్పే వీరగాథల్లో పాలమూరు జిల్లా ప్రాంతంలో సుప్రసిద్దమైన పండుగ సాయన్న కథ, మియాబ్ కథ, శంకరమ్మ కథ, ఎండబెట్ల పకీరయ్య, వనపర్తి రాజుల కథలు, పాలమూరు జిల్లాకే మొనగాడు సాయన్న అంటూ పండుగ సాయన్న కథ చెబుతుంటే వినాల్సిందే. ఇలాంటి పాటలకు కేరాఫ్ అడ్రస్‌గా కిన్నెర మొగులయ్య నిలిచాడు.
జానపదానికి జీవం
వీరగాథలను, తెలంగాణ సంస్కృత్రిని చాటడమే తన లక్ష్యమంటూ జానపదానికి జీవం పోస్తున్న సహజ విద్వాంసుడు. తెలంగాణ వీరగాథలను 12 మెట్ల కిన్నెరతో అద్భుతంగా వివరిస్తూ నీళ్లు, అన్నం లేకున్నా పరవాలేదు. కానీ కిన్నెర లేకపోతే బతుకలేనని కిన్నెరను తన ఆరో ప్రాణంగా భావిస్తూ పల్లె పాటలకు జీవం పోస్తున్నాడు.
కిన్నెర తయారీ
“తాత ముత్తాతల నుంచి కిన్నెర పాట అబ్బంది. మా అయ్యగూడ పాడేటోడు. ఐదు తరాల కింద మా ముత్తాత కాశీమయ్య మొదటిసారి కిన్నెర తయారు చేసిండు. అప్పుడు గుండ్రటి ఆనంకాయ (సోరకాయలు) బుర్రలు, దుసరి తీగ, నల్లదీగలు, పెద్ద జీవాల నరాలతోని కిన్నెర చేసిండు. నా దగ్గరికి వచ్చేటప్పటికి కొబ్బరి చిప్పలు, ఆనంబుర్రలు ఉక్కు తీగలతో పన్నెండు మెట్ల కిన్నెర చేసిన. ఈ మెట్ల మీద రాగాలు పలికించటమే కిన్నెర పాట గొప్పతనం” అని మొగులయ్య అన్నాడు.
కుటుంబ నేపథ్యం..
ఈయనది నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అవుసలికుంట. తల్లిదండ్రులు ఎల్లయ్య, రాములమ్మ చిన్న పూరి గుడిసెలో ఉంటూ కట్టెలమ్ముకొని బతికేవారు. ఆకలి తీర్చుకోవటానికి దేవదారి చెట్టాకులు ఉడకపెట్టుకుని తిని బతికిన రోజులున్నాయి. ఉపాధి కోసం నాగర్‌కర్నూల్ జిల్లా గట్టు రాయిపాకుల వలసపోయారు. అప్పట్లో నెలకు రూ.30లకే పని చేసి జీవనం కొనసాగించారు
అలా వెలుగులోకి..
మొగులయ్య కళను ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఓ పీహెచ్‌డీ స్కాలర్ వెలుగులోకి తీసుకురావడంతో గత ప్రభుత్వం గుర్తించింది. నెలవారి ఫించన్‌తోపాటు ఉగాది పురస్కారాలతో సత్కరించింది. మొగులయ్య ప్రతిభకుగానూ పద్మశ్రీ అవార్డును కూడా దక్కింది. నాటి నుంచి మొగులయ్య తన కళను పలు వేదికల మీద ప్రదర్శిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు.
- మల్లయ్య, నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి)