calender_icon.png 19 July, 2025 | 4:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచ మున్సిపల్ ఆఫీసులో సోదాలు

19-07-2025 12:54:02 AM

  1. అక్రమాలను గుర్తించిన ఏసీబీ అధికారులు
  2. పలు రికార్డులు, డాక్యుమెంట్లు, రూ.50 వేలు స్వాధీనం 
  3. ఆరు గంటల పాటు సాగిన తనిఖీలు

భద్రాద్రి కొత్తగూడెం, జూలై 18 (విజయక్రాంతి): ఉన్నతాధికారులకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు ఆరుగంటల పాటు సోదాలు నిర్వహించారు. అధికారులు, సిబ్బందిపై వచ్చిన పలు ఫిర్యాదుల నేపథ్యంలో కార్యాలయంలోని అన్ని విభాగాల్లో అధికారుల సెల్‌ఫోన్ లను స్వాధీనం చేసుకొని తనిఖీలు నిర్వహించారు.

కార్పొరేషన్ అధికారులను, సిబ్బందిని విచారించి, సేకరించిన వివరాలను రికార్డ్ చేశారు. సిబ్బందిని తనిఖీ చేయగా వారి వద్ద అక్రమంగా కలిగి ఉన్న రూ.50 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయానికి వచ్చిన దరఖాస్తులను, వాటి స్థితులను సిబ్బందిని అడిగి వారి వాంగ్మూలాలను నమోదు చేశారు.

కార్పొరేషన్ కమిషనర్ సుజాత, మేనేజర్ ఎల్వీ సత్యనారాయణ, టౌన్ ప్లానింగ్ అధికారి నవీన్‌కుమార్‌ను వేర్వేరుగా విచారించారు. రికార్డుల నిర్వహణ, దరఖాస్తుల ప్రక్రియ, ఇతర అనుమతుల జారీలో అక్రమాలను గుర్తించి ఆధారాలను సేకరించారు.