calender_icon.png 10 November, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌లో ముగిసిన రెండోదశ ఎన్నికల ప్రచారం

10-11-2025 01:38:24 AM

  1. చివరి రోజు సర్వశక్తులు ఒడ్డిన ఎన్డీయే, ఆర్జేడీ కూటముల నేతలు
  2. రేపు 122 శాసన సభ స్థానాలకు పోలింగ్

పాట్నా, నవంబర్9 : బీహార్‌లో అసెంబ్లీ రెండో దశ ఎన్నికల ప్రచారానికి ఆదివారం తెరపడింది. 122 శాసన సభ స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. మొత్తం 243 స్థానాలకు గాను తొలి వశలో 121 స్థానాలకు పోలీంగ్ పూర్తయింది. 

చివరి రోజు హోరాహోరీగా..

బీహార్ రెండో దశ ఎన్నికలలో చివరి రోజు ఎన్డీయే, ఆర్జేడీ కూటముల నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు, సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో పాటు ఇతర నేతలు బహిరంగ సభల్లో ప్రసంగించారు. సాసారామ్, అర్వాల్‌లలో అమిత్‌షా ప్రచారం నిర్వహించారు. ఇక్కడ బీజేపీ బలహీనంగా ఉండడంతో అగ్రనేతలు ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా దాదాపు 14సభలతో పాటు రోడ్‌షోలు నిర్వహించారు. 

రాహుల్, తేజస్వీలు సుడిగాలిలా..

ఆర్జేడీ నేత, సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలు జిల్లాల్లో సుడిగాలిలా పర్యటించి ప్రచారం చేసి సర్వశక్తులు ఒడ్డారు. తేజస్వీయాదవ్ అనేక నియోజకవర్గాల్లో తిరిగారు. సీమాంచల్ ప్రాంతంలోని కిషన్‌గంజ్, పూర్ణియా జిల్లాల్లో రాహుల్ ఓటర్లను అభ్యర్థించారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్వహించిన 15 సభల్లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ప్రియాంక గాంధీ కూడా పది సభల్లో పాల్గొన్నారు. జన్‌సూరజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ ఝంఝార్‌పూర్, మధుబనీలలో రోడ్‌షోలు నిర్వహిచారు.