10-11-2025 01:37:01 AM
న్యూఢిల్లీ, నవంబర్ 9: ఢిల్లీలో చలితోపాటు కాలుష్యం కూడా పంజా విసురుతోంది. రోజురోజుకూ కాలుష్య తీవ్రత, చలితీవ్రత పెరుగుతుండడంతో గాలి నాణ్యత వేగంగా తగ్గుతోంది. దీంతో చిన్నారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఢిల్లీ ప్రజలు ఆదివారం రాత్రి ఆందోళన చేశారు. వివిధ వర్గాల ప్రజలు, తల్లిదండ్రులు, పర్యావరణ కార్యకర్తలు ఇండియా గేట్ వద్ద భారీ నిరసన చేశారు.
ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాలుష్య తీవ్రత వల్ల చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అందుకే తల్లిదండ్రులు వీధుల్లోకి తరలొచ్చి ఆందోళన చేశారని ఓ పర్యావరణ వేత్త పేర్కొన్నారు. ప్రతి ముగ్గురి పిల్లల్లో ఒకరి ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని, స్వచ్ఛమైన గాలిలో పెరిగే పిల్లలతో పోలిస్తే వీరి జీవిత కాలం దాదాపు 10 ఏళ్లు తక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ సీఎం షీలా దీక్షిత్ హయాంలో ఢిల్లీ ‘గ్రీన్ క్యాపిటల్’గా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో చేరిందని మరో నిరసనకారుడు ఆరోపించారు. అయితే నిరసనకారులను అదుపులో కి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.