01-12-2024 12:55:39 AM
-మాడభూషి శ్రీధర్
సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలకు వివిధ వివరణలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. వాటిని తమ తమ అవసరాలకు వాడుకుంటూ, సెక్యులరిజం అనే మాటను వేర్వేరుగా అన్వయించుకుంటున్నారు.
రాజ్యాంగ పీఠిక రావణ కాష్టం వలె తగలబడుతూ ఉంది. అందరూ సమానమే అన్నా నేరమా? మరోవైపు వసుధైక కుటుంబం అంటాం. వసుధైవ కుటుంబకం అనేది మహా ఉపనిషత్తు వంటి హిందూ గ్రంథాలలో కనిపించే సంస్కృత పదబంధం. దీని అర్థం ప్రపంచం ఒకే కుటుంబం అని చెప్పినా, వ్యక్తిగత లేదా కుటుంబ ప్రయోజనాల కంటే సామూహిక శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తూ, ప్రపంచ దృక్పథాన్ని నొక్కిచెప్పడం వల్ల ఈ పదబంధం ఆలోచన నేటికీ సంబంధితంగా ఉందని అన్నా, వద్దంటున్నారు.
రాజకీయంగా కొందరికి నచ్చదు. తిట్టిపోస్తారు కూడా. కొన్ని కారణాలున్నాయి. ఎందుకంటే పూర్తిగా లౌకిక వాదం అర్థం చేసుకోవడం లేదు. కనుక సుప్రీంకోర్టు పదే పదే చెప్పవలసిన అవసరం వస్తున్నది. మన రాజ్యాంగంలో లౌకిక వాదం భాగమేనని ఇప్పటికే ఎన్నో కేసుల్లో చెప్పింది. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు స్పష్టం చేసింది.
పదేపదే సమయం వృథా
మొత్తం మన రాజ్యాంగానికి పీఠిక ఒక పునాది. అందరూ నచ్చి, ఆమోదించి, సంతకాలు చేసిన వారిలో లెఫ్ట్, రైట్ రాజకీయాల వారు కూడా ఉన్నారు. రాజ్యాంగ పీఠిక నుంచి సెక్యులర్, సామ్యవాద పదాలను తొలగించాలని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కొన్ని సంవత్సరాలనుంచి అడుగుతున్నారు. ఒకసారి సుప్రీంకోర్టు 1973నాటి తీర్పులో మెజారిటీ వారు కచ్చితంగా చెప్పిన తరువాత ఎన్ని సార్లు ఇదే మాట సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తారు.
ఇది దుర్వినియోగం. ప్రజల సమయాన్ని నష్టం చేయడం తప్ప మరొకటేమీ కాదు. ఇదే చిన్న కోర్టులో కేసు పెట్టినా, హైకోర్టులో పెద్ద లాయర్ గారు కూడా చెప్పినా సెక్యులర్, సామ్యవాద పదాలను కొట్టివేసేవారు. కాని మరీ పెద్దయిన రాజకీయ రంగులు, రంగాలు కూడా ఉన్నవారు కనుక, సుప్రీంకోర్టు వారు వింటూ వస్తున్నారు. మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ న్యాయశాఖ మంత్రులు కూడా ఈ పిటిషన్లు వేయడం మంచి విషయం కాదు. సెక్యులరిజం అనేది మానవత్వానికి సంబంధించిన విషయం. విషం మాత్రం కాదు. అయినా ఈ విషం చిలుకుతూ తొలగించాలని కోరుతూనే ఉంటారు.
మళ్లీ ఈ మధ్య బహుళ ప్రముఖులు పిల్ వేసారు. వీటిని ప్రజాప్రయోజన వ్యాజ్యాలను అనడం మంచి మాట కాదు. చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం నవంబర్ 28న మళ్లీ వివరంగా వాదోపవాదాలు విన్నారు. పిటిషనర్, లాయర్ విష్ణు శంకర్ జైన్ వాదనలు వినిపించారు. దానికి మీద చాలా లాపాయింట్లు ఉన్నాయి. 1976లో రాజ్యాంగానికి చేపట్టిన 42వ సవరణపై అప్పటి పార్లమెంట్‌లో చర్చ జరగలేదనే వాదనను వారు లేవనెత్తారు.
గతంలోనే తీర్పులు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం.. సెక్యులరిజం, సోషలిస్ట్ అనే పదాలను తర్వాత చేర్చినా.. రాజ్యాంగంలో అవి ఇమిడి ఉన్నాయని తేల్చి చెప్పింది. 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో లౌకిక, సామ్యవాద అనే పదాలు రాజ్యాంగంలో భాగమేనని సుప్రీంకోర్టు వివరించింది. ఇది ఒక అభిప్రాయం మాత్రమే కాదు. అత్యధిక మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా మరీ మరీ వివరించాల్సి వచ్చింది. సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలకు వివిధ వివరణలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. వాటిని తమ తమ అవసరాలకు వాడుకుంటూ, సెక్యులరిజం అనే మాటను వేర్వేరుగా అన్వయించుకుంటున్నారు. మనం పదాలు మాత్రమే చూస్తున్నాం కాని, ఆ పదాల వెనుక ఉన్న భావాలు, సిద్ధాంతాలు, మొత్తం రాజ్యాంగంలో కనబడే లక్షణాలను అర్థం చేసుకోవడంలో విఫలమవుతున్నాం.
బేసిక్ స్ట్రక్చర్ ఇది. అంటే మూలమైన లక్షణాలు. ఎన్నోసార్లు ఇవి రాజ్యాంగంలోని ప్రాథమిక భాగాలుగా కోర్టులు, చిన్న, పెద్ద, మరీ పెద్ద ధర్మాసన పీఠాలు చెప్పాయి. మళ్లీ సుప్రీంకోర్టు ఈ రకమైన కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగం నుంచి సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను తొలగించాల్సిన అవసరం లేదని, రాజ్యాంగంలో భాగమేనని తేల్చిచెప్పింది ఆ తర్వాత రాజ్యాంగ సవరణ చేసి.. వాటిని చేర్చారు.
అయినా సవరణ ద్వారా చేసినా, చేయకపోయినా ఈ మౌలిక స్వరూపం మారదు. అయితే తీసేద్దాం అని కూడా వాదించే వారు ఉంటారు. భావనారూపంగా ఉన్న లక్షణాలను స్పష్టంగా పదాలు చేర్చినపుడు సమస్య ఏమిటి? అనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
అందరూ సమానం కాదు. నిజమే. కాని దాని అర్థం సమానం గా అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ప్రయత్నించాలని అంటున్నారు. ఆర్టికల్ 14 అదే మన హక్కు. ప్రాథమిక హక్కు. ఆర్టికల్ 14 ఉన్న తరువాత సెక్యులరిజం రద్దు చేస్తామంటే ఆ హక్కు ఊహను వద్దంటారా! దానికి ఏమనాలి.
సోషలిజం గురించి ...
సోషలిజం అంటే అందరికీ సమాన అవకాశాలు ఉండాలని అన్నట్టే సోషలిజం అంటేకూడా అది సమానత్వాన్ని ప్రతిబింబిస్తుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. దీన్ని మరో రకంగా చూడకూడదని, అప్పుడు వేరే అర్థం కూడా వస్తుందని సీజేఐ వివరిస్తున్నారు. లా క్లాస్‌లో లెక్చర్ వంటి ప్రవచనం చేయవలసి వస్తున్నది. అంతే కాదు మరో న్యాయవాది లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ మళ్లీ మళ్లీ వాదిస్తూనే ఉన్నారు. వారు చాలా గొప్పవారు. ప్రభుత్వం పక్షంలా మాట్లాడడం తప్పుకాదు. కాని ఎన్ని సార్లు?
1976లో 42వ రాజ్యాంగ సవరణ అమలయింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ చాలా తప్పులు చేశారు. ఆమే ఎమర్జెన్సీ విధించారు. అందరం ఇప్పటికీ ఇందిరాగాంధీ చేసిన తప్పులనే అనుకుంటున్నాం. ఎన్నెన్నో వాదనలు విన్న తరువాత జస్టిస్ సంజీవ్ ఖన్నాభారత్ లౌకిక దేశంగా ఉండాలని మీరు అనుకోవడంలేదా అంటూ సూటిగా, ఓపికగా అడిగారు. భారత్ లౌకిక దేశంగా ఉండకూడదని తాము అనడం లేదని.. అయితే ఆ సవరణను మాత్రమే సవాల్ చేసినట్లు అని విష్ణు శంకర్ జైన్ ప్రస్తావించారు.
రాజ్యాంగ పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు చేర్చడం రకరకాలు సమస్యలను పుట్లుపుట్లుగా తెరిచినట్లు అయిందని అయితే అది భవిష్యత్తులో ప్రజాస్వామ్యం అనే పదాన్ని కూడా తొలగించవచ్చని వారు అనుమానం వ్యక్తం చేశారట. ఇప్పటికీ ప్రజాస్వామ్యం ఎందుకండీ మనకు అనే వాళ్లూ ఉంటారు. పైకి చెప్పరు కాని, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించే మహానుభావులు సైతం అమ్మో ప్రజాస్వామం ఉండాల్సిందే అంటారు.
రెండు భాగాలుగా పీఠిక!
సుబ్రహ్మణ్య స్వామి సమర్థుడు, గొప్పవారు. ఎంతో వాదనా పటిమ కలిగిన న్యాయవాది. ఆయన వాదన ముఖ్య అంశాలు ఇవి:
* రాజ్యాంగ పీఠికలో 1949 నవంబర్ 26వ తేదీ ఉండటం తప్పని నేను నిరూపిస్తా.
* భారత రాజ్యాంగ పీఠిక రెండు భాగాలుగా ఉండొచ్చు.
* సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు చేర్చడానికి దేశ ప్రజలు అంగీకరించలేదు.
* పీఠిక రెండు భాగాల్లో ఒక దానిని తేదీతో, మరో దానికి తేదీ లేకుండా ఉంచవచ్చు.
దీనికి మన సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇంకా ఏదైనా సంబంధిత పత్రాలను పిటిషనర్లు సమర్పిస్తే వాటిని పరిశీలిస్తామని చెప్పారు. అంటే ఇది ఇప్పుడే ముగియదు. నోటీసులు జారీ చేయడానికి మాత్రం బెంచ్ అంగీకరించలేదు. ఇది చాలా గొప్ప విషయం. విచారణ మళ్లీ డిసెంబర్ 18వ తేదీకి వాయిదా వేశారు. ఇది ఒక తీర్పులో రిపోర్ట్ అయిన విషయం కాదు. పత్రికలలో, మీడియాలో వచ్చిన అంశాల ఆధారంగా చెప్పిన అంశాలు.