14-05-2025 12:46:40 AM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ టౌన్, మే 13 : రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, అధికృత డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. తక్కువ ధరకు ఆశపడి అనధికారిక డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు.
వ్యవసాయ సాగులో రైతులు ఇబ్బందులు పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విత్తన కేంద్రాలను ఏర్పాటు చేసి రాయితీ పై రైతులకు విత్తనాలను అందజేస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ వద్ద తెలంగాణ విత్తన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విత్తన కేంద్రాన్ని ప్రారంభించి 50 శాతం సబ్సిడీ పై పచ్చిరొట్టె ఎరువుల విత్తనాల పంపిణీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కల్తీ విత్తనాలు కొని మోసపోకుండా తెలంగాణ విత్తన సంస్థ ద్వారా పంపిణీ చేసే విత్తనాలు కొనాలని చెప్పారు. వివిధ రకాల విత్తనాలు బ్లాక్ మార్కెట్లో అమ్మకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల బయోమెట్రిక్ హాజరు తీసుకుని విత్తనాలను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి తదితరులు ఉన్నారు.