26-11-2025 12:00:00 AM
ఆక్రమణలు ఉపేక్షించేది లేదని స్పష్టం అధికారులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవెంబర్25 (విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు పట్టు బిగించారు. మంగళవారం జరిగిన దాడుల్లో రెండు కట్టడాలను టాస్క్ఫోర్స్ బృందం సీజ్ చేసింది. గత ఏడాది టీఆర్నగర్లో ఆక్రమించిన వ్యక్తికి రెవెన్యూ శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీ సాయంతో ఆక్రమణను తొలగించారు.
అదే సమయంలో బీడీపీపీ ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా మరో ఇద్దరు వ్యక్తులు రెండు అంతస్తుల భవనాల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నట్లు మున్సిపల్, రెవెన్యూ అధికారులు గుర్తించారు. పనులు ఆపాలన్న నోటీసులను కూడా వారు పట్టించుకోకపోవడంతో టా స్క్ఫోర్స్ రంగంలోకి దిగింది. ఫిర్యాదుల నేపథ్యంలో ఆర్డీవో లోకేశ్వరరావు ఆధ్వర్యంలో అధికారులు మంగళవారం వంగాల శశి, వడ్డేపల్లి హరిష్ల ఇళ్లకు తాళాలు వేసి సీజ్ చేశారు.
తెలంగాణ పురపాలక సంఘం చట్టం2019లోని సెక్షన్ 181(1) ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు ఆర్డీవో తెలిపారు. మరిన్ని ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని హెచ్చరించారు. అక్రమ కట్టడాలపై అధికారులు తీసుకున్న దృఢమైన చర్యలను ప్రజా సంఘాలు స్వాగతించాయి. అన్ని అక్రమ నిర్మాణాలపై కూడా ఇలాగే కఠినంగా వ్యవహరించాలంటూ డిమాండ్ ఉత్పన్నం అవుతుంది.ఈ చర్యల్లో మున్సిపల్ కమిషనర్ గజానంద్, సీఐ బాలాజీ వరప్రసాద్, తహసీల్దార్ రియాజ్ అలీ, అగ్నిమాపక అధికారి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.