calender_icon.png 26 November, 2025 | 2:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపయోగంగా శాంతినగర్ బస్టాండ్

26-11-2025 12:00:00 AM

నిర్మించి ఏళ్లు గడుస్తున్న.. ప్రయాణికుల ఆదరణకు నోచుకోని వైనం 

బస్టాండ్ ప్రాంగణంలో నిలుపని ఆర్టీసీ బస్సులు 

తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు కరువు

అలంపూర్, నవంబర్ 25: గద్వాల జిల్లా అలంపూర్ పరిధిలోని రెండవ అతిపెద్ద మున్సిపాలిటీ కేంద్రంగా ఉన్న  వడ్డేపల్లి మండల పరిధిలోని శాంతినగర్ పట్టణంలో గత కొన్ని ఏళ్ల కిందట నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం ప్రయాణికులు లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోతుంది. ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం కేవలం బోర్డుకే పరిమితం తప్ప... ప్రయాణికుల ఆదరణకు నోచుకోలేదనే పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ బస్టాండ్ కొందరి నిరాశ్రయులకు ఆశ్రయం ఇచ్చే గూడుగా మారింది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఆర్టీసీ బస్టాండు ఉన్నదన్న సంగతే గుర్తు లేకుండా పోయినట్టు అనిపిస్తోంది. బస్టాండ్ మీదుగా  అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి ఉండడంతో వందలకొద్దీ సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రజా రవాణా దృష్టిలో ఉంచుకొని సరైన మౌలిక వసతులు కల్పిస్తే... ఆర్టీసీ బస్సులకు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే కొందరు ఆర్టీసీ డ్రైవర్లు శాంతినగర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ఆర్టీసీ బస్సులను నిలిపి అక్కడ నుంచే ప్రయాణికులను ఎక్కించుకొని బస్టాండ్ వైపు వెళ్లకుండా నేరుగా ఆయా ప్రాంతాలకు వెళ్తున్నట్లు తెలిసింది.  దీని ద్వారా కనీసం ఆర్టీసీ బస్సులు బస్టాండు వైపే కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.అక్కడక్కడ బస్సులను నిలిపి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో ప్రయాణికులు  కూడా ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్లే పరిస్థితి తప్పినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి పలు ఆర్టీసీ డిపోలకు చెందిన బస్సులు బస్టాండ్ ప్రాంగణంలో కొద్దిసేపు బస్సులను నిలపాలి. తద్వారా ప్రయాణికులు కూడా బస్టాండ్ పై ఉంది అన్న ఆలోచనతో  బస్టాండుకు చేరుకునే అవకాశం ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా డ్రైవర్ కండక్టర్ల తీరు ఉండడంతో ప్రయాణికులకు కూడా బస్టాండ్ లేదు అన్న సందిగ్ధంలోనే ఉన్నారు.

వందల సంఖ్యలో ప్రయాణికుల రాకపోకలు

పరిసర ప్రాంత ప్రజలకు శాంతినగర్ పట్టణం కేంద్ర బిందువుగా మారింది.ఇతర ప్రాంతాల నుంచి నిత్యం వందలకొద్దీ సంఖ్యలో ప్రజలు ఆయా ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రధానంగా ఈ దారి గుండా ఏపీ ,కర్ణాటకకు  ప్రధాన అంతర్రాష్ట్ర రహదారి  కావడంతో కర్ణాటక తెలంగాణకు చెందిన బస్సుల్లో ప్రజలు ప్రయాణిస్తుంటారు.

గద్వాల, ఐజ, శాంతినగర్ , అలంపూర్ చౌరస్తా, మీదుగా హైదరాబాద్ , కర్నూలు వంటి పలు నగరాలకు ప్రజల రాకపోకలు కొనసాగుతాయి. బస్టాండుపై ప్రయాణికులకు అవగాహన కల్పించడంతోపాటు బస్టాండ్ ఆవరణంలో పలు రకాల సౌకర్యాలను కల్పిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగొచ్చని పలువురు భావిస్తున్నారు.

దీనిపైన సంబంధిత జిల్లా ఆర్టిసి అధికారులు ప్రజా రవాణా అవసరాల కొరకు ఏర్పాటు చేసిన బస్టాండు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఆచరణలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు. అదేవిధంగా బస్టాండ్ ప్రాంగణంలో  ప్రయాణికుల కొరకు మౌలిక సౌకర్యాలు  కల్పిస్తే .. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగి ప్రైవేట్ వాహనాల ప్రమాదాల నివారణ కూడా ఆస్కారం ఉంటుందన్నారు.

బస్టాండ్ ప్రాంగణంలో బస్సులు నిలపాలి 

కొన్నేళ్ల కిందట నిర్మించిన బస్టాండులో బస్సులు  ఆపకపోవడంతో... ప్రయాణికులు ఎక్కడపడితే అక్కడ బస్సులను ఎక్కుతున్నారు. బస్టాండ్ ప్రాంగణంలో మౌలిక వసతులు కల్పించి.. బస్సులు నిలిపితే ప్రయాణకులకు మేలు ఉంటుంది. దీనిపైన ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకొని వసతులు ఏర్పాటు చేయడంతో పాటు బస్సులను ఆపాలి.

- శేఖర్ కోయిల, దిన్నె గ్రామం