25-08-2025 12:35:28 AM
నిజామాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థులు ఎంబీబీఎస్ విద్యార్థిపై ర్యాగింగ్ చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. అటెండెన్స్ విషయంలో మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల్లో జరిగిన గొడవ నిజామాబాద్ జిల్లాతో పాటు రాష్ర్ట వ్యాప్తంగా దుమారం లేపింది. నిజామాబాద్ మెడికల్ కళాశాలలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన రాహుల్‌రెడ్డి ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు.
ఎంబీబీఎస్ చివరి సంవత్సరం విద్యార్థులు ఆయా విభాగాల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధులు నిర్వర్తించడానికి నిత్యం అటెండెన్స్ వేయడానికి పీజీ విద్యార్థులు డ్యూటీలు నిర్వహిస్తున్నారు. రాహుల్ గత ఐదు రోజులుగా పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతూ కూడా గైనకాలజీ విభాగంలో డ్యూటీ చేస్తూ రిజిస్టర్‌లో నమోదు చేసుకున్నాడు. కానీ సాయిరాం, పవన్ అనే పీజీ విద్యార్థులు అటెండెన్స్ రిపోర్ట్‌లో ఆబ్సెంట్ వేశారు.
ఈ విషయమై సాయిరాం, పవన్‌లను అడగగా దాడికి పాల్పడ్డారని రాహుల్ ఆరోపించాడు. హాస్టల్‌లోని 302 రూమ్ నెంబర్‌లోకి పిలిపించుకుని, పది నుంచి 20 మంది తనపై దుర్భాషలాడుతూ.. దాడి చేశారని వాపోయాడు. పచ్చకామర్లతో బాధపడుతున్నానని, అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ చూపించినప్పటికీని పట్టించుకోకుండా తీవ్రంగా కొట్టారని రాహుల్ చెప్పాడు.
వేధింపులకు గురిచేస్తూనే బయోడేటా చెప్పమన్నారని, బయోడేటా చెప్తుండగా తప్పు చెపుతున్నావంటూ పదేపదే మళ్లీ చెప్పిస్తూ నిలబడిన చోట నుంచి కదలకుండా గంటల తరబడి బయోడేటా చెప్పించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని రాహుల్ తెలిపాడు. ఫోన్ లాక్కుని, పర్సనల్ చాట్స్ చదువుకుంటూ అపహస్యానికి గురిచేస్తూ ఇబ్బంది పెట్టారని రాహుల్ వాపోయాడు.
ఆ గది గది వద్ద ఇద్దరిని కాపాలా పెట్టి తనతో పాటు వచ్చిన వారిని బెదిరించి, అక్కడి నుంచి పంపించారని ఆరోపించాడు. నిజామాబాద్ వన్‌టౌన్‌లో రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీజీ విద్యార్థులైన సాయిరాం, పవన్, శ్రవణ్, సాత్విక్, ఉదయ్‌పాల్, అభినవ్, పెద్ది ఆదిత్య అనే విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ర్యాగింగ్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. సంస్థల పరిధిలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.