03-05-2025 10:37:16 PM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి..
కడ్తాల్: రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayan Reddy) అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే పాల్గొని గ్రామంలో పాదయాత్రగా తిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి, డిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహా, జిల్లా నాయకుడు బీక్యా నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్యా నాయక్, నాయకులు జావర్ లాల్ నాయక్, హిర సింగ్ తదితరులు పాల్గొన్నారు.