calender_icon.png 10 January, 2026 | 9:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించాలి

09-01-2026 09:05:01 PM

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి 

నిజామాబాద్,(విజయక్రాంతి): అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, గర్భిణీలకు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. బోధన్ డివిజన్ లోని 113 అంగన్వాడీ కేంద్రాలకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో దీక్షిత్ గ్యాస్ ఏజెన్సీ వారు ఉచితంగా గ్యాస్ పొయ్యిలు సమకూర్చారు. అదేవిధంగా అంగన్వాడీ కేంద్రాలలో బియ్యం, ఇతర సరుకులు భద్రపరచుకునేందుకు అనువుగా ఉండే ప్లాస్టిక్ కంటైనర్లు స్థానిక నాయకుడు శరత్ అందించారు.

బోధన్ పట్టణంలోని లయన్స్ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, డివిజన్ లోని మిగతా అంగన్వాడీ సెంటర్లకు కూడా వీటిని సమకూరుస్తామని అన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు.

ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది సమర్ధవంతంగా పని చేయాలని హితవు పలికారు. కోరిన మేరకు సదుపాయాలు సమకూరుస్తున్నామని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, అంగన్వాడీ కేంద్రాల పనితీరులో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగానే మినీ అంగన్వాడీలను అప్ గ్రేడ్ చేసిందని అన్నారు. ఎక్కడ కూడా మహిళల కోసం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు అమలు కావడం లేదన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ ఉద్యోగులు తమ హక్కులు, బాధ్యతలను గుర్తెరిగి చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యాల పరిరక్షణకు పాటుపడాలని, వారికి నాణ్యమైన పౌష్టికాహారం అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ గడుగు గంగాధర్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, బోధన్ తహసిల్దార్ విట్టల్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, బోధన్ సీడీపీఓ డి.పద్మ తదితరులు ఉన్నారు.