calender_icon.png 8 July, 2025 | 7:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యాబ్యాంక్ ఏర్పాటు చేయండి!

08-07-2025 01:48:59 AM

- ఫీజు రీయింబర్స్‌మెంట్ భారాన్ని తగ్గించేందుకు కాలేజీల కొత్త ప్రతిపాదన

- ఆ బ్యాంకు లావాదేవీలతో బకాయిలు రూ.2,400 కోట్లు చెల్లించండి

- డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్కతో చర్చించిన కళాశాలల యాజమాన్యాలు 

- పరిశీలించేందుకు కమిటీ వేస్తామన్న ప్రభుత్వం

హైదరాబాద్, జూలై 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇంజినీరింగ్, బీఫార్మసీ, బీఈడీ తదితర కోర్సులు చదివే విద్యార్థుల కోసం ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఏటా రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ బకాయిలు గత మూడేళ్లుగా పేరుకుపోయి దాదాపు రూ.8 వేల కోట్లకు చేరుకున్నాయి.

ఈ నిధులను ప్రైవేట్ కాలేజీలకు చెల్లించేందుకు ప్రభుత్వం అపసోపాలు పడుతోంది. ప్రతి యేటా ఎంతో కొంత బకాయిలు విడుదల చేసేందుకు టోకెన్లు జారీ చేసి సర్కారు చేతులు దులుపుకుంటోంది. ఆ టోకెన్లకు నిధులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండటం లేదు. ఇలాగే గతంలో ఇచ్చిన టోకెన్లకు దాదాపు రూ.2వేల కోట్లకుపైగా నిధులను కాలేజీలకు చెల్లించాల్సిఉంది.

ప్రభుత్వానికి రీయింబర్స్‌మెంట్ భారాన్ని తగ్గించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా కాలేజీల సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూషన్స్) సరికొత్త ప్రతిపాదన ముం దుంచింది. సోమవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఉన్నతాధికారులతో ఫెడరేషన్ నాయకులు సమావేశమై ప్రతిపాదనలను వివరించారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో స్టేట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ బ్యాంక్ (విద్యాబ్యాంక్) పెట్టాలని కోరారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఈడీ తదితర ఉన్నత విద్యను అందించే ప్రైవేట్ కాలేజీలు తమ ఆర్థిక లావాదేవీలు వివిధ ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రస్తుతం జరుపుతున్నాయి. ఈ కాలేజీల ఉద్యోగులు, ఇతరత్రా లావాదేవీలన్నీ రకరకాల బ్యాంకుల ద్వారా ఏటా జరుపుతున్నారు.

ప్రభుత్వ కాలేజీలు, అందులో పనిచేసే ఉద్యోగులు, జీతా లు, పెన్షన్లు, ఇతరత్రా ఆర్థిక లావాదేవీలను కూడా బ్యాంకుల ద్వారా నిర్వహిస్తున్నారు. ఇలా సుమారు రూ.65వేల కోట్లకుపైగా లావాదేవీలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ లావాదేవీలన్నీ కూడా ఎడ్యుకేషన్ బ్యాంక్ ను కొత్తగా ఏర్పాటు చేసి వాటి ద్వారా జరపడం ద్వారా ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,100కోట్లు ఇస్తుంది. ఇది దాదాపు ఒక ఏడాదికి ఖర్చయ్యే రూ.2,400 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దాదాపు సమానం.

ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా కాలేజీలకు ఫీజులను చెల్లించొచ్చని కాలేజీల స మాఖ్య నాయకులు డిప్యూటీ సీఎంకు ప్రతిపాదించారు. అయితే ఈ బ్యాంక్ ఖాతాలన్నీ ఒకే బ్యాంకు కిందకు తీసుకురావాల్సి ఉంటుంది. ఈ తరహా విధా నం ఇతర దేశాల్లో అమలవుతోంది. మన దేశంలో గుజరాత్ రాష్ట్రం అమలు చేస్తున్నది.

దీంతోపాటు ప్రతి కంపెనీ సీఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద నిధులు ఇచ్చేలా చూడాలన్నారు. వాటి ద్వారా ఏటా రూ.400 కోట్లు వస్తాయని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నత విద్యా సమాఖ్య చైర్మన్ డా.రమేశ్ అరోరా వివరించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్టళ్లపై ప్రభుత్వం నియంత్రణ ద్వారా కూడా నిధులు సమకూర్చుకోవచ్చని తెలిపారు.

ఈ ప్రతిపాదనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు కళా శాల యాజమాన్యాలు తెలిపాయి. దీనిపై ఐదుగురి ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం ఓ కమిటీని వేసిన ట్లు చెప్పాయి. వచ్చే సోమవారం మరోసారి దీనిపై సమావేశం కావాలని నిర్ణయించారు.

సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. వీ బాలకిష్టారెడ్డి, సాంకేతిక, కళాశాల విద్యా కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నతాధికా రులు ఎన్ శ్రీధర్, ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్‌స్టిట్యూష న్స్ నాయకులు రవి కేఎస్, రవీందర్‌రెడ్డి, డా.కే రామదాస్, రమేశ్‌బాబు, పరమేశ్వర్‌రెడ్డి, సునిత భూపాల్‌రెడ్డి, సునీల్ కుమార్, సత్యనారాయణ, కొడాలి కృష్ణారావు పాల్గొన్నారు.