11-09-2025 12:04:23 AM
-నిర్మల్ జిల్లాలో ముగ్గురు, గద్వాల జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఒకరు మృతి
నిర్మల్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి)/అయిజ: రాష్ట్రంలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో బుధవారం పిడుగుపాటుకు ఏడుగురు మృతిచెందారు. నిర్మల్ జిల్లాలో ముగ్గురు, గద్వాల జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఒకరు మృతి చెందారు. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని గుమ్మిన యడ్లాపూర్ గ్రామంలో పిడుగు పడి ముగ్గురు మృతి చెందారు.
బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురవడంతో పంటచేల్లోకి వెళ్లిన దంపతులు మల్లెపు ఎల్లయ్య, మల్లెపు ఎల్లవ్వతో పాటు అదే గ్రామానికి చెందిన బండారు వెంకట్ వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తున్నారు. వర్షం కురవడంతో ఓ గుడిసె వద్ద ఆగగా ఒక్కసారిగా పిడుగు పడటంతో ముగ్గురూ మృతిచెందారు. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు అవకాశం లేకుండాపోయింది. మారుమూల గిరిజన గ్రామం కావడంతో ఆ గ్రామానికి వెళ్లాలంటే రెండు వాగులు దాటాలి. రెండు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వెళ్లేందుకు అధికారులు ఇబ్బందులు పడ్డారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండల పరిధిలోని భూంపురం గ్రామంలో బుధవారం సాయంత్రం పొలం పనులకు వెళ్లిన కూలీలపై పిడుగు పడి ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భూంపురం గ్రామంలో తిమ్మప్ప అనే రైతు పొలంలో సీడ్ పత్తి క్రాసింగ్ చేసే పనులకు ఐదుగురు కూలీలు వెళ్లారు. సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో కూలీలందరూ పంట పొలంలోనే ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడటంతో భూంపురానికి చెందిన సర్వేశ్ (19), పార్వతి (28), పులికల్ గ్రామానికి చెందిన సౌభాగ్యమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందారు. పులికల్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు రాజు, జ్యోతితోపాటు మరో ఇద్దరు గాయపడ్డారు.
ఖమ్మం జిల్లాలో
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం పాకలగూడెం పంచాయతీ సత్యనారాయణపురా నికి చెందిన ధరావత్ భాష, కాంతం దంపతుల రెండో కుమారుడు మహేశ్(26) గ్రామ శివారులో గేదెలు మేపుతున్న క్రమంలో పిడుగు పడింది. దీంతో మహేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు.
వాగును దాటి.. వైద్యం అందించి వైద్య సిబ్బంది అవస్థలు
బోథ్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో బుధవారం వైద్య సిబ్బంది హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడానికి నానా అవస్థలు పడ్డారు. నడుచుకుంటూ వెళ్లి గ్రామానికి చేరుకువాల్సి ఉంటుంది. భారీ వర్షాలతో గ్రామ సమీపంలోని వాగు ప్రవహిస్తుండటంతో వైద్య సిబ్బంది తంటాలు పడుతూ వాగు దాటి హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడం దురదృష్టకరం. ఎమర్జెన్సీలో ఆ గ్రామస్తులకు దేవుడే దిక్కు అని వైద్య సిబ్బంది అంటున్నారు.