23-09-2025 01:24:34 AM
-బాలా త్రిపుర సుందరిగా వరంగల్ భద్రకాళీమాత
-శైలపుత్రిదేవిగా జోగుళాంబ అమ్మవారి దర్శనం
-దర్శనానికి పోటెత్తిన భక్తులు
వరంగల్/హనుమకొండ, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవస్థానంలో శరన్నవరత్ర మహోత్సవములు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఉద యం 4 గంటలకు నిత్యహ్నికం నిర్వర్తించిన పిమ్మట అర్చకులు అమ్మవారికి ఉత్సవానుజ్ఞ ప్రార్ధన జరిపారు.
అమ్మవారు అను గ్రహించిందన్న సూచన రాగానే గణపతి పూజ, పుణ్యహవాచనం, ఉత్సవ పూర్వాంగ విధి నిర్వహించిన పిమ్మట అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పంచోధకాలు, ఔషధులు, వృక్షపల్లవ కషాయాలు, సుగంధ ద్రవ్యాలు ఇత్యాది పలు విధములైన వస్తు సంభారములతో రెండు గంటల పాటు అమ్మవారి అభిషేక కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం నవరాత్రి వేడుకలను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య జ్యోతి ప్రారంభించారు. భేరీపూజ జరిపిన అనంతరం ఉత్సవాల ద్వజారోహణం జరిపారు. అమ్మవారిని బాలాత్రిపుర సుందరిగా అలంకరించి పూజారాధనలు జరిపిన తర్వాత అమ్మవారిని ఉదయం వృషభ వాహన సేవ మీద సాయంకాలం, మృగవాహన సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలా త్రిపురసుందరి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.