04-10-2025 12:16:36 AM
వరంగల్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ది గాంచిన శ్రీ భద్రకాళి దేవస్థానంలో దేవిశరన్నవరాత్రులు విజయ దశమితో ముగిశాయి. ఉదయం నిత్యాహ్నికం నిర్వర్తించి కలశోద్వాసన జరిపి అమ్మవారికి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపిన పిమ్మట చక్ర తీర్తోత్సవం (చక్ర స్నానం), ద్వజావరోహణం జరిపారు. దాదాపు ఎనభై వేల మంది ఈ విజయ దశమి రోజున అమ్మవారిని దర్శించుకున్నారు.
శమీ వృక్షానికి పూజ చేసి శమీ పత్రాలను (జమ్మి ఆకులను) భక్తులు పరస్పరం పంచుకున్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బందా ప్రకాష్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయ దాతలుగా రత్న హోటల్ అధినేతలు పింగిలి సంపత్ రెడ్డి సునీత దంపతులు హాజరయ్యారు. ఇక శుక్రవారం మధ్యాహ్న అమ్మవారికి శతఘటభిషేకం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు దేవాలయ ప్రాంగణంలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంలో జరిగిన శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణం ఆద్యంతం భక్తులను ఒక దివ్యానుభూతికి గురిచేసింది. కళ్యాణం అనంతరం భగవత్ప్రసాదంగా భక్తులకు రుచికరమైన ప్రసాద వితరణ జరిగింది.
కళ్యాణం రోజు ఉపయుధాతలుగా మంచాల శ్రీకాంత్ కవిత దంపతులు, మంచాల నవీన్ స్వప్న దంపతులు, యాద కిషన్ శోభ, రేగురి ఆంజనేయులు సరళ దంపతులు వ్యవహరించారు. కళ్యాణోత్సవం వరంగల్ ప్రముఖ వ్యాపారవేత్తలు ఇరుకుల్ల నాగేశ్వరరావు శ్రీదేవి దంపతుల సౌజన్యంతో నిర్వహించబడింది. దేవీ నవరాత్రులలో పది రోజులగా అయితా గోపినాథ్ ఆద్వర్యంలో భద్రకాళీ భక్త సేవా సమితి ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ అశేష అన్నదానములు భక్తుల ప్రశంశలకు పాత్రమయ్యాయి. ఈ కళ్యాణోత్సవంతో భద్రకాళి దేవీ శరన్నవరాత్రుల ఉత్సవ పరిసమాప్తి జరిగింది.
ఎన్సిసి ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, సేవా సమితి, దేవీ నవరాత్రులకు సహకరించిన దాతలకు, 1986 కిట్స్ రామ్ టెక్ బ్యాచ్, నాయకులకు, అధికార, అనధికార, ప్రముఖులకు ముఖ్యంగా పోలీసు సిబ్బందికి మీడియా ప్రతినిధులు జరిపిన సేవలపట్ల దేవాలయ చైర్మన్ డాక్టర్ బి.శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, కటకం రాములు, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, తొగరు క్రాంతి, బింగి సతీష్, మోత్కూరి మయూరి, గాండ్ల స్రవంతి, నార్ల సుగుణ, పాలడుగుల ఆంజనేయులు, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాసరావు, మూగ శ్రీనివాసరావు, ఎక్స్ అఫీషియో మెంబర్ పార్నంది నరసింహా మూర్తి, కార్యనిర్వహణాధికారి రామల సునీత కృతజ్ఞతలు తెలిపారు