23-09-2025 01:22:55 AM
-బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ
-అమ్మవారిని పెద్దసంఖ్యలో దర్శించుకున్న భక్తులు
-అన్ని ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం
విజయవాడ, సెప్టెంబర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
ఉత్సవాల్లో తొలిరోజు బెజవాడ కనకదుర్గమ్మ శ్రీబాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. జైభవాని.. జైజై దుర్గ భవాని అనే నినాదాలతో భక్తులు బాల త్రిపుర సుందరిదేవి అలంకరణలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
ప్రధమంగా అమ్మవారిని మంత్రులు, దేవాదాయ శాఖ కమిషనర్, ఈవో సీపీలు దర్శించుకున్నారు. క్యూలైన్లు అన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఊరేగించారు. మహా మండపం ౬వ అంతస్తులో కుంకుమ పూజలను, ఇతర అర్జిత సేవలను వైభవంగా నిర్వహించారు.