calender_icon.png 27 September, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ష్.. గప్ చుప్!

27-09-2025 12:00:00 AM

-నిజామాబాద్ రూరల్‌లో కల్లు లొల్లి 

-దుకాణాల కేటాయింపులపై వివాదం 

-అధికార పార్టీపై గౌడల ఆగ్రహం 

-కేటాయింపుల్లో ప్రజాప్రతినిధి జోక్యం 

-అనుచరుడికే ఇవ్వాలని బెదిరింపు 

-ఆపై అధికారులకు హుకుం 

నిజామాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల కల్లు దుకాణాల నిర్వహణ చుట్టూ తీవ్ర వివాదం చెలరేగింది. సాధారణంగా కల్లు కాంట్రాక్టుల కేటాయింపులు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగి, స్థానికంగా గౌడ కుటుంబాల మధ్య సమానంగా పంచిపెడతారు. కానీ ఈసారి ఒక ప్రముఖ ప్రజా ప్రతినిధి నేరుగా రంగంలోకి దిగి, అధికారులపై ఒత్తిడి తెచ్చి తన అనుచరుడైన ఒక గౌడ నాయకుడికి మాత్రమే మొత్తం దుకాణాలను అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేశారన్న వార్తలు వెలువడటంతో గౌడ వర్గంలో ఆగ్రహం చెలరేగింది.

ఎక్సైజ్ అధికారులపై హుకుం..

సదరు ప్రజా ప్రతినిధి స్వయంగా ఎక్సైజ్ అధికారులను పిలిపించి సమావేశం నిర్వహించి, నా మనిషికే దుకాణాలు ఇవ్వాలి అని తేల్చి చెప్పినట్టు సమాచారం. ఇంతవరకు స్థానికంగా సమన్వయంతో కేటాయింపులు జరిగితే, ఇప్పుడు ఒక్కరిపై ఆధారపడి బలవంతపు నిర్ణయం తీసుకోవడం వందల కుటుంబాల జీవనాధారాన్ని ప్రమాదంలోకి నెట్టేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కోట్ల రూపాయల లావాదేవీలు అక్రమాలకు ఊతమా..? 

మోపాల్, నిజామాబాద్ రూరల్ మండలాల్లో నెలకు కోట్ల రూపాయల విలువ చేసే కల్లు అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ వ్యాపారం వెనుక పెద్ద ఎత్తున డబ్బు తిరుగుతుందన్న వాస్తవం అందరికీ తెలిసిందే. అధికార ప్రతినిధి ఒకే కాంట్రాక్టర్ను ఆశ్రయించడం వెనుక వాటాల లావాదేవీ ఉన్నదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాక, ఇప్పటికే కృత్రిమ కల్లు తయారీ, ఆరోగ్యానికి హాని చేసే రసాయనాల కల్తీ జరుగుతున్న తరుణంలో ఇలాంటి బలవంతపు కేటాయింపులు సామాన్యుల ప్రాణాలతో ఆటలాడటమేనని విమర్శకులు అంటున్నారు.

గౌడల ఆగ్రహావేశం..

ఒక్కరి కోసం వందల కుటుంబాల పొట్టకూటి పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తూ గౌడ కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్థానికంగా దుకాణాలపై ఆధారపడి బతికే వందల కుటుంబాలకు ఇది ప్రాణప్రశ్న. సదరు ప్రజా ప్రతినిధి మాట వినని వారిపై దాడులు చేయిస్తానని, కేసులు పెట్టిస్తానని బెదిరించడం గౌడల అసహనానికి మరింత కారణమైంది. ఇక కొందరు గౌడ పెద్దలు స్పష్టంగా వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతాం అని బహిరంగ హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం. ఇది అధికార పార్టీకి నేరుగా ఎదురుదెబ్బ అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఎక్సైజ్ అధికారుల గందరగోళం..

ఇలాంటి ఒత్తిళ్ల కారణంగా ఎక్సైజ్ అధికారులు కక్కలేని, మింగలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. బలవంతంగా కేటాయింపులు చేస్తే ప్రజా వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారుల ఆగ్రహం కూడా తప్పదనే భయంతో వారు అసహనంగా ఉన్నారు. ఈ గందరగోళం అధికారులను ఏ వైపు మొగ్గాలి? అనే స్థితిలో నిలిపివేసింది.

అధికార పార్టీకి రాజకీయ ఇబ్బందులు..

ఈ పరిణామాలన్నీ అధికార పార్టీకి రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా గౌడ వర్గం ఒక ప్రధాన సామాజిక వర్గం. ఈ వర్గాన్ని దూరం చేసుకోవడం రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో మాత్రమే కాకుండా, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రతికూల ప్రభావం చూపనుందనే అంచనాలు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ వర్గ గౌడలు కూడా ఈ పరిస్థితిని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారని చెప్పబడు తోంది. స్థానిక స్థాయిలో అసంతృప్తి పెరిగితే, పెద్ద ఎత్తున గౌడలు అధికార పార్టీని వదిలి వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కాసుల కోసం పార్టీకే చెడ్డపేరు.. 

సాధారణ గౌడ కుటుంబాలు కాసుల కోసం పార్టీకి చెడ్డపేరు తెచ్చుకోవద్దు అని హెచ్చరిస్తున్నాయి. ఒకే వ్యక్తి లాభం కోసం వందలాది కుటుంబాల జీవనోపాధి పణంగా పెట్టడమే కాకుండా, కుల వర్గాన్ని పార్టీకి దూరం చేయడం ఎంతవరకు సరైన రాజకీయ వ్యూహమన్న ప్రశ్నలు ప్రతిష్టంభనగా మారాయి.

మొదటికే మోసం తెచ్చేనా..? 

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కల్లు దుకాణాల వివాదం, కేవలం కాంట్రాక్టుల కేటాయింపు సమస్య కాకుండా అధికార పార్టీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశంగా మారింది. ఒక్క వ్యక్తి ప్రయోజనం కోసం సామాజిక వర్గాన్ని దూరం చేయడం, వాటాల రాజకీయాలు నడపడం  ఇవన్నీ అధికార పార్టీకి పెద్ద మైనస్గా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తే, కల్లు కేటాయింపులు రాబోయే రోజుల్లో ఎన్నికల కేటాయింపులపై ప్రభావం చూపడం ఖాయం అన్న అభిప్రాయం వెలువడుతోంది.