calender_icon.png 8 January, 2026 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెల్నెస్ సెంటర్లో డాక్టర్ల కొరతా

06-01-2026 09:21:48 PM

ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, జర్నలిస్టులు

నిజామాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసి అందులో ఎంబిబిఎస్ వైద్యులను ప్రభుత్వం నియమించి ఓపి వైద్య సేవలను అందించడానికి వెల్నెస్ సెంటర్ కేంద్రం ప్రభుత్వ, రిటైర్డ్, పాత్రికేయుల కోసం ఈ సెంటర్ ను ఏర్పాటు చేయగా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ సెంటర్లో పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడంతో జిల్లా నలుమూలల  నుండి వచ్చే రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కాగా నిజామాబాద్ వెల్నెస్ సెంటర్ లో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. పూర్తిస్థాయి డాక్టర్లు లేకపోవడంతో చేసేదేమీ లేక వెల్నెస్ సెంటర్ ఇన్చార్జ్ అధికారిని పీజీ చదివే మెడికల్ విద్యార్థులతో వంతుల వారీగా రోజుకో మెడికల్ పీజీ స్టూడెంట్ ను రప్పించి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు, పాత్రికేయులకు కేవలం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓపి సేవలు అందిస్తున్నారు. వాస్తవానికి ముగ్గురు ఎంబిబిఎస్ వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క ఎంబిబిఎస్ వైద్యుడు కూడా సదరు వెల్నెస్ సెంటర్లో అందుబాటులో లేకపోవడం గమనార్హం.

అందులో ఇదివరకు విధులు నిర్వహించిన ఎంబిబిఎస్ డాక్టర్లు రాజీనామా చేసి వేరే చోటికి వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.  మధ్యాహ్నం నుండి వైద్యం చూపించడానికి వచ్చే రోగులకు వెల్నెస్ సెంటర్లో డాక్టర్లు లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి కాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అందులో పని చేసే ఉద్యోగులు సైతం ఫోన్లో కాలక్షేపాలు చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్నెస్ సెంటర్లో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే డాక్టర్ను నియమించాలని రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయులు కోరుతున్నారు.