10-09-2025 01:52:58 AM
జూబ్లీహిల్స్‌లోని వాణిజ్య భవనంపై అక్రమ నిర్మాణం..
అనుమతి లేని పెంట్‌హౌస్‌పై జీహెచ్‌ఎంసీ సీరియస్
వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులో కోరిన టౌన్ ప్లానింగ్ అధికారులు
హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు బల్దియా అధికారులు షాకిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన వాణిజ్య భవనంపై నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నిర్మించిన పెంట్‌హౌస్‌ను ఎందు కు కూల్చివేయకూడదో చెప్పాలంటూ జీహెఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం సోమవారం నోటీసులు జారీ చేసింది.
అనుమతులు లేకుండానే..జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో అల్లు అరవింద్ ‘బిజినెస్ పార్క్’ పేరుతో వెయ్యి గజాల విస్తీర్ణంలో ఓ భారీ వాణిజ్య భవనాన్ని నిర్మించారు. దీనికి గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు నాలుగు అంతస్తులకు (జీ4) జీహెఎంసీ నుంచి అధికారికంగా అనుమతులు తీసుకున్నారు. సుమారు ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవనాన్ని అప్పటి నుంచి వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారు.
అంతా సవ్యంగానే ఉందనుకుంటున్న తరుణంలో, ఇటీవల భవనంపై అనుమతులు లేకుండా కొత్తగా ఓ పెంట్‌హౌస్‌ను నిర్మించినట్లు దృష్టికి వచ్చింది.అనుమతించిన ఫ్లోర్ల కంటే అదనంగా నిర్మాణం చేపట్టడం తీవ్రమైన ఉల్లంఘనగా బల్దియా అధికారులు పరిగణించారు. ఈ నేపథ్యంలో, అక్రమ నిర్మాణాన్ని ఎందుకు కూల్చివేయకూడదో తక్షణమే వివరణ ఇవ్వాలని అల్లు అరవింద్‌కు షో-కాజ్ నోటీసును జారీ చేశారు.
సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రముఖులే ఇలా నిబంధనలను బేఖాతరు చేస్తే ఇతరులకు తప్పుడు సంకేతాలు పంపుతుందని, అందుకే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించాం అని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
అల్లు అరవింద్ ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే, బల్దియా చట్ట ప్రకారం పెంట్‌హౌస్‌ను కూల్చివేసేందుకు వెనుకాడబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.ఈ వ్యవహారంపై అల్లు అరవింద్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.