31-10-2025 01:12:40 AM
 
							* జారీ చేసిన అపోలో యాజమాన్యం
* సమ్మెను భగ్నం చేసేందుకు కుట్ర
చేగుంట, అక్టోబర్ 30 :చేగుంట మండలం వడియారంలోని ఏపిఎల్ అపోలో ట్యూబ్స్ యూనిట్ 5లో జరుగుతున్న అక్రమ బదిలీలకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన సమ్మె 24వ రోజుకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ యాజమాన్యం యూనియన్ సభ్యులకు షో కాజ్ నోటీసులు జారీ చేస్తూ కార్మికులను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని కార్మికులు వాపోతున్నారు. కంపెనీ ముందు పారదర్శకంగా, న్యాయపరమైన విధంగా జరుగుతున్న సమ్మెను భగ్నం చేయాలనే ఉద్దేశంతో యాజమాన్యం వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా నోటీసులు పంపించడం జరిగిందని, ఇది స్పష్టమైన బెదిరింపు చర్య అని దుయ్యబట్టారు.
ఇది కార్మికుల ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయాలనే కుట్రగా కార్మిక సంఘ నాయకులు విమర్శించారు. కార్మికులు ఈ సందర్బంగా మాట్లాడుతూ బెదిరింపులు, నోటీసులు మమ్మల్ని ఆపలేవని, మా హక్కుల కోసం, మా కుటుంబాల భవిష్యత్తు కోసం, అక్రమ బదిలీల రద్దు జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు, ఈ కార్యక్రమంలో అపోలో ట్యూబ్స్ మజ్దూర్ సంఘ్ జనరల్ సెక్రటరీ కుల్ల నర్సింలు. కోశాధికారి కుంట రాజ్ కుమార్, జాయింట్ సెక్రటరీ చవాన్ సురేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నవీన్ యాదవ్, శ్రీనివాస్, కార్యవర్గ సభ్యుడు సునీల్ పాస్వాన్, యూనియన్ కార్మికులు పాల్గొన్నారు.