calender_icon.png 12 July, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైకుంఠ ధామానికి దారి చూపరూ!

12-07-2025 12:37:34 AM

  1. ఊరొక చోట.. శ్మశానవాటిక ఇంకోచోట
  2. ప్రజలకు ఉపయోగపడని వైనం లక్షల నిధులు వృథా

మహబూబాబాద్, జూలై 11 (విజయ క్రాంతి): ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను ఖర్చు చేయడం.. మినహా.. చేసిన పని ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించే నాధుడే లేదనడానికి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ధర్మారం తండాలో నిర్మించిన స్మశాన వాటిక ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నాలుగేళ్ల క్రితం గ్రామానికి వైకుంఠధామం నిర్మించడానికి 8 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు.

అయితే వైకుంఠధామం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండే చోట నిర్మించకుండా, గ్రామానికి సుదూరంగా నిర్మించారు. దీనికి తోడు గ్రామం నుండి వైకుంఠధామానికి దారి లేదు.  దీనితో లక్షల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన వైకుంఠధామం వినియోగానికి అందుబాటులో లేకపోవడంతో ఇప్పటివరకు వినియోగించుకునే పరిస్థితి లేకుండా నిరుపయోగంగా మారింది.

వైకుంఠధామాన్ని నిర్మించి వదిలేయడం వల్ల తలుపులు, కిటికీలు పూర్తిగా పాడైపోయాయి. అలాగే గదులకు సంబంధించిన మట్టి వర్షానికి కొట్టుకుపోవడంతో గదుల కింద పిల్లర్లు దెబ్బతిని కూలిపోయే పరిస్థితి నెలకొంది. ధర్మారం తండా నుండి స్మశాన వాటికకు వెళ్లడానికి అసలు ‘దారే’ లేదు.

ధర్మారం తండా వాసులు ఎవరైనా చనిపోతే ఈ స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించాలంటే తాళ్లపూస పల్లి, లేదంటే అన్నారం మీదుగా 5 కిలోమీటర్లు తీసుకువచ్చి అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి. దీంతో నిర్మించిన నాటి నుండి నేటి వరకు స్మశాన వాటికను ఎవరు కూడా వినియోగించ లేదు. స్మశాన వాటికకు ధర్మారం తండా నుంచి నేరుగా రహదారి సౌకర్యం కల్పిస్తే తప్ప వైకుంఠధామం ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.

వైకుంఠధామం నిర్మాణానికి నిధులు మంజూరు కాగానే అనాలోచితమైన ధోరణి అవలంబించి తండా నుండి దారిలేని చోట నిర్మించడం వల్లే ఎందుకు పనికి రాకుండా పోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తండా నుంచి స్మశాన వాటికకు దారి ఏర్పాటు చేసి, స్మశాన వాటికలో పాడైపోయిన డోర్లు కిటికీలను తిరిగి కొత్తవి ఏర్పాటు చేసి, నీటి వసతి కల్పించి వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.