12-07-2025 12:35:36 AM
జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కాగజ్ నగర్,(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం కాగజ్ నగర్ మండలం ఎన్జీవోస్ కాలనీ గ్రామపంచాయతీలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అరులైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఇండ్ల నిర్మాణ దశలను రికార్డులలో నమోదు చేయాలని, తదనగుణంగా సంబంధిత లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకునే విధంగా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం, ప్రధానమంత్రి శ్రీ నిధుల ద్వారా నూతనంగా నిర్మిస్తున్న అదనపు తరగతి గదులు పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. వంట సమయంలో తాజా కూరగాయలు, నాణ్యమైన నిత్యవసర సరుకులను వినియోగించాలని తెలిపారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని, తరగతిలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.