ఆయిల్‌ఫామ్ సాగులో సిద్దిపేట 3వ స్థానం

27-04-2024 02:37:47 AM

జిల్లాలో 7వేల ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ సాగు లక్ష్యంగా పనిచేయాలి

రాష్ట్ర హార్టికల్చర్, సెరికల్చర్ కమిషనర్ అశోక్‌రెడ్డి


సిద్దిపేట,ఏప్రిల్26 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆయిల్‌ఫామ్ తోటల సాగులో  సిద్దిపేట జిల్లా 3వ స్థానంలో నిలిచిందని రాష్ట్ర హార్టికల్చర్, సెరికల్చర్ కమిషనర్ అశోక్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని నర్మెటలో ఆయిల్‌ఫామ్ పరిశ్రమ నిర్మాణ పనులను ఆయన పరిశీలించి పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్ వరకు జిల్లాలో వచ్చే ఆయిల్‌ఫామ్ పంటను రైతుల నుంచి స్వీకరించేందుకు ఫ్యాక్టరీ వద్ద కలెక్టింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి అశ్వారావుపేట ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీకి పంపించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు.

అనంతరం జిల్లా ఉద్యానవన, వ్యవసాయ, ఆయిల్‌ఫెడ్, మైక్రో ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో పామాయిల్ తోటల పెంపకంపై సమీక్షనిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పామాయిల్ తోటల పెంపకానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. పామాయిల్ తోటల విస్తీర్ణంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల తర్వాత 11,140ఎకరాల్లో ఆయిల్‌ఫామ్ సాగు చేసి సిద్దిపేట జిల్లా మూడోస్థానంలో నిలిచిందన్నారు.

అలాగే నర్మెటలో రూ. 300కోట్లతో పామాయిల్ ఫ్యాక్టరీ కూడా నిర్మాణం జరుగుతున్నందున రైతులు పండించిన పామాయిల్ పంట మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. జిల్లాలో 7వేల ఎకరాల్లో కొత్తగా పామాయిల్ తోటల సాగుకు ఉద్యానవన, వ్యవసాయ, మార్కుఫెడ్, మైక్రో ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ఆయిల్‌ఫామ్ ఫ్యాక్టరీకి ఇప్పటికే రూ. 40కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ పాల్గొన్నారు.