02-12-2024 12:00:00 AM
1 - సయ్యద్ మోదీ టైటిల్ నెగ్గిన భారత తొలి మహిళల డబుల్స్ జంట ట్రీసా
* రెండు ఒలింపిక్ పతకాలు ఆమె పేరిట ఉన్నా.. కొన్ని రోజులుగా సరైన ప్రదర్శన చేయలేక చతికిలపడుతోంది. గౌరవప్రదంగా రిటైర్ అయితే బెటర్ అని ఎక్కడో ఓ చోట అంటూనే ఉన్నా.. ఆమె వెనుకడుగు వేయలేదు. సింహం రెండడుగులు వెనక్కి వేసినంత మాత్రాన రేసులో ఓడినట్లు కాదని రుజువు చేసింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో సత్తా చాటి.. తనకు తానే సాటి.. తనకెవరూ లేరు పోటీ అని చాటి చెప్పింది.
లక్నో: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్-300 టోర్నీ ఫైనల్లో పీవీ సింధు 21-14, 21-16 తేడాతో వు లు యు (చైనా) మీద విజయం సాధించింది. సింధు ఈ టోర్నీని గెలుచుకోవడం ఇది మూడోసారి. గత కొద్ది రోజులుగా అంచనాలను అందుకోలేకపోతున్న సింధు ఈ సారి కూడా గెలవడం కష్టమే అని అంతా అన్నారు.
కానీ సింధు ఆ అంచనాలను తలకిందులు చేస్తూ మెడల్ గెలుచుకుంది. చివరిసారిగా 2022, 2017లో ఈ టోర్నీ గెలిచింది. ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌లో 10 దేశాల నుంచి 36 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. చైనా క్రీడాకారిణితో ఫైనల్ అంటే సింధు విజయం మీద చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా సింధు టైటిల్ గెలుచుకుంది. ఈ మ్యాచ్ 47 నిమిషాల పాటు జరిగింది.
లక్ష్యసేన్ కూడా..
పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన లక్ష్యసేన్ 21-6, 21-7 తేడాతో జాసన్ (సింగపూర్) మీద సునాయస విజయం సాధించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకం చేజార్చుకున్న లక్ష్య ఈ మ్యాచ్‌లో ఎటువంటి పొరపాట్లకు తావివ్వలేదు. ఈ పోరు కేవలం 31 నిమిషాల్లోనే పూర్తవడం గమనార్హం. తొలి నుంచే లక్ష్య ప్రత్యర్థి మీద పూర్తి ఆధిపత్యం చెలాయించాడు.
తొలిసారి నెగ్గిన ట్రీసా-గాయత్రి
ఇక మహిళల డబుల్స్ విభాగంలో ట్రీసా జాలీ-గాయత్రి గోపీచంద్ జోడీ 21-18, 21-11 తేడాతో లిజింగ్-లికియాన్ (చైనా) మీద విజయం సాధించి.. తొలిసారి సయ్యద్ మోదీ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు.
ప్చ్.- డబుల్స్
పురుషుల డబుల్స్‌లో పృథ్వి కృష్ణమూర్తి-సాయి ప్రతీక్ జోడీ 14-21, 21-19, 17-21 తేడాతో హువాంగ్ డీ-లియూ యాంగ్ (చైనా) చేతిలో ఓడిపోయి నిరాశపరిచారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీషా-ధ్రువ్ జోడీ 21-18, 14-21, 8-21 తేడాతో డెచాపోల్-సుపిస్సార (థాయ్‌లాండ్) జోడీ మీద పరాజయం పాలయ్యారు.