calender_icon.png 16 August, 2025 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు ధర తగ్గిస్తేనే సింగరేణికి భవిష్యత్తు

16-08-2025 12:29:34 AM

టన్నుకు రూ.వెయ్యి తగ్గించాలి లేదంటే థర్మల్ విద్యుత్ సంస్థలు దూరం అయ్యే ప్రమాదం

స్వాతంత్ర వేడుకల్లో సింగరేణి సీఎండీ బలరాం 

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15 (విజయక్రాంతి): సింగరేణి బొగ్గు ధర తగ్గిస్తేనే సంస్థకు భవిష్యత్తు సింగరేణి సంస్థ సీఎండీ బలరాం అన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన 79వ స్వాతంత్ర వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం సంస్థ సవాళ్లను అధిగమించాలంటే కనీసం టన్ను బొగ్గుకు రూ.వెయ్యి తగ్గించాలన్నారు. కోల్ ఇండియా గత దశాబ్ద కాలంలో బొగ్గు ధరలు కేవలం 20 శాతం మాత్రమే పెంచిందని, సింగరేణి యాజమాన్యం 170 శాతం వరకు పెంచాల్సి వచ్చింది అన్నారు.

సింగరేణి సంస్థలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు, పెరుగుతున్న జీతభత్యాలు అందుకు కారణమన్నారు. సింగరేణి కంటే తక్కువ ధరకు టన్నుకు సుమారు రూ.2 వేల వరకు కోల్ ఇండియా సబ్సిడరీ కంపెనీలు విక్రయిస్తున్నాయన్నారు. సింగరేణి నుంచి సుమారు 90శాతం బొగ్గును తీసుకుంటున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు సైతం ఇక్కడ బొగ్గు ధర ఎక్కువగా ఉన్నదని, తక్కువ ధరకు లభించే చోట బొగ్గు తీసుకోవడానికి అనుమతించమని ప్రభుత్వాలను కోరుతున్నారని వివరించారు. ప్రభుత్వాలు అనుమతిస్తే సింగరేణి మనుగడ ప్రమాదకరంగా మారినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు ధరతో పాటు నాణ్యత కూడా ఎంతో ప్రధానమైన అంశమని చెప్పారు. గ్రేడ్ బొగ్గును సరఫరా చేయాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉన్నదన్నారు.