09-07-2025 01:19:06 PM
సార్వత్రిక సమ్మెకు సకలజనులూ మద్దతు
నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
చట్టాల రద్దుపై నిరసన గళం
సమ్మెకు బీఎంఎస్ దూరం
బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం(Central Government) అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక విధానాలకు వ్యతిరేకంగా తలపెట్టిన సార్వత్రిక సింగరేణి సమ్మె(General Singareni Strike) సక్సెస్ అయింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు సింగరేణిలో బుధవారం గనులు డిపార్ట్మెంట్లు బందు చేసి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. కేంద్రం తీసుకువస్తున్న నూతన లేబర్ కోడ్, కనీస వేతనాల పెంపు,ప్రైవేటీకరణ నిర్ణయాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు ఈ రోజు పిలుపునిచ్చాయి.
ఈ పిలుపుకు స్పందించి సింగరేణిలో కార్మికులు స్పందించారు.ఫలితంగా భారీ ఎత్తున బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అత్యవసర సిబ్బంది తప్ప అన్ని విభాగాల కార్మికులు, ఉద్యోగులు సమ్మెకు సంఘీభావంగా విధులు బహిష్కరించారు. ఒకరోజు సమ్మె ఫలితంగా మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖనిలో 8 వందల టన్నులు, కాసిపేట 6వందలు, కాసిపేట 2లో 650 టన్నుల బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. అండర్ గ్రౌండ్ గనులతో పాటు కైరగూడ ఓసీలో 10 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మందమర్రి, గోలేటి ఏరియాలో సమ్మె సైరన్ మోగింది.
భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ లు, డిపార్ట్మెంటుల్లో పనిచేస్తున్న కార్మికులు సైతం సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఎక్కడికి అక్కడ సింగరేణి కార్యకలాపాలు నిలిచిపోయాయి. సింగరేణిలో సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపించింది. కార్మిక చట్టాల రద్దు పై సింగరేణి కార్మిక లోకం సమ్మె చేసి తమ వ్యతిరేకతను ప్రకటించింది. సింగరేణిలో జాతీయ సంఘాలు జేఏసీగా ఏర్పడి సార్వత్రిక సమ్మెకు సింగరేణిలో పిలుపునిచ్చారు. జేఏసీలో ఏఐటీయూసీ, ఐఎన్టీ యూ సీ,టీబీజీకేఎస్, సీఐటీయూ, ఐఎఫ్ టీయూ, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘoతో పాటు అన్ని సంఘాలు ఏకమయ్యాయి. సింగరేణి కార్మిక లోకం సమ్మెకు సానుకూలంగా స్పందించారు. సింగరేణిలో సార్వత్రిక సమ్మెను దిగ్విజయం చేసింది.
సమ్మెకు బీఎంఎస్ దూరం..
సింగరేణిలో సార్వత్రిక సమ్మెకు జాతీయ కార్మిక సంఘం బీఎంఎస్ దూరంగా ఉంది. కార్మిక సంఘం పేరిట సింగరేణి పనిచేస్తున్న ఆ సంఘం సమ్మెకు దూరంగా ఉండడం పట్ల విమర్శలను మూటగట్టుకుంది. కార్మికుల హక్కులకు విఘాతం కలిగించే కొత్త లేబర్ కోడ్ తీసుకువస్తున్నకేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. దాని కొనసాగింపులో భాగంగానే సార్వత్రిక సమ్మె. ఈ సమ్మెను సింగరేణిలో అన్ని ప్రధాన కార్మిక సంఘాలు తమ భుజస్కందాలపై వేసుకున్నాయి. కానీ బిఎంఎస్ మాత్రం కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక నిర్ణయానికి మద్దతుగా నిలిచిందని జేఏసీ కార్మిక సంఘాలు మొదటి నుంచీ ఎండగడుతూ వచ్చాయి.
సమ్మెకు దూరంగా ఉండడం కార్మిక ద్రోహిమే అవుతుందని ఆ సంఘం విధాన నిర్ణయం పై సింగరేణిలో కార్మికుల నుంచి వ్యతిరేకత పెల్లుబికింది. అయినప్పటికీ బి.ఎం.ఎస్ తన నిర్ణయాన్ని పున: పరిశీలన చేసుకోకపోగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలపై తీసుకున్న నిర్ణయానికి వత్తాసు పలకడం సింగరేణిలో తీవ్ర విమర్శలను కొనితెచ్చుకుంది. సింగరేణిలో కార్మికులు, ఔట్సోర్సింగ్ కార్మికులు సైతం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం సమ్మెతో కదం తొక్కారు. సార్వత్రిక సమ్మె సింగరేణిలో జేఏసీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఫలప్రదం అయింది. సమ్మె సక్సెస్ తో కార్మిక వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయం పై సింగరేణి సూరీలు తమ తిరుగుబాటు బావుటను మరోసారి ఎగరవేశాయి.
సమ్మె సక్సె తో సరిపెట్టుకోవద్ద...
కార్మిక చట్టాల పర్యవేక్షణకు చేపట్టిన సార్వత్రిక సమ్మె సింగరేణిలో సక్సెస్ తోటే సరిపెట్టుకోవద్దని పలువురు అభిప్రాయపడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కార్మిక వ్యతిరేక, చట్టాల రద్దు ను విరమించుకునేంతవరకు ఇదే స్ఫూర్తితో కార్మిక సంఘాలు పోరాడాల్సిన అవసరం ఉంది. ఒకరోజు సమ్మె విజయ గర్వంతో కార్మిక సంఘాలు సంబురంలో పడిపోయి దీర్ఘకాలిక పోరాట లక్ష్యాన్ని విస్మరించరాదన్న విషయాన్ని కార్మిక సంఘాలు గుర్తుపెట్టుకోవాలి.