09-07-2025 06:39:50 PM
ఇంటిదారి పట్టిన విద్యార్థులు..
నిజాంసాగర్ (విజయక్రాంతి): పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో విద్యార్థులు పస్తులుండిపోయారు. బుధవారం దేశవ్యాప్త కార్మికుల సమ్మెల కారణంగా జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికులు ఒకరోజు సమ్మె చేపట్టారు. దీంతో కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం నిలిచిపోయింది.
నిజాంసాగర్ మండల కేంద్రంలో
నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం అందించలేదు. దీంతో మాగి గోర్గుల్, జీఎస్ఆర్ ఫ్యాక్టరీ వడ్డేపల్లి గ్రామాల విద్యార్థులు మధ్యాహ్నానికి ఇళ్లకు వెళ్లిపోయారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో ఉండి చదువుకునే విద్యార్థులు మాత్రం ఇళ్లకు వెళ్లి భోజనాలు చేసి తిరిగి స్కూల్కు వెళ్లారు. బీసీ వసతి గృహంలో విద్యార్థులకు అప్పటికప్పుడు భోజనాలు తయారు చేయించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేక
నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం చర్చనీయాంశమైంది. దేశవ్యాప్త సమ్మె ఉన్నట్లు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. ఉపాధ్యాయులు మాత్రం పక్కనే ఉన్న బీసీ వసతి గృహం (BC hostel) నుంచి భోజనాన్ని తెప్పించుకొని భోజనం చేసినట్లు తెలిసింది. విద్యార్థులు మాత్రం ఇళ్లకు వెళ్లిపోయారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు
తిరుపతిరెడ్డి, ఎంఈవో
నిజాంసాగర్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు భోజనం ఏజెన్సీ నిర్వాహకులు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో బుధవారం మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేయలేకపోయారు. అందుకే విద్యార్థులు ఇంటి బాట పట్టారు. మరోసారి ఇలాంటి తప్పు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటాం.