09-07-2025 07:08:36 PM
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రఘుపతిరావు..
వాజేడు (విజయక్రాంతి): కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్స్ తీసుకువచ్చిందని ఈ లేబర్ కోడ్స్ రద్దు చేసేంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని సిఐటియు(CITU) ములుగు జిల్లా ఉపాధ్యక్షులు కొప్పుల రఘుపతిరావు అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా వాజేడు మండలంలోని కార్మికులు మండల కేంద్రంలో గల సంతపాకల సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసిల్దార్ కార్యాలయంలో సమర్పించారు. ఈ సమ్మెలో మండలంలోని ఆశ, అంగన్వాడి, గ్రామపంచాయతీ, మధ్యాహ్నం భోజన వర్కర్స్, పేరూరు, వాజేడు జిల్లా కోపరేటివ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొప్పుల రఘుపతిరావు మాట్లాడుతూ... కార్మికులను బానిసలు చేసేందుకు కార్పొరేట్లకు రెడ్ కార్పెంటర్ పరిచేందుకు బిజెపి ప్రభుత్వం పూనుకుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడా బాబుల కోసం, బహుళ జాతి కంపెనీల కోసం తప్ప కార్మికుల కోసం ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వేతనాలు విడుదల చేయకుండా శ్రమ దోపిడీ చేస్తుందని, స్కీమ్ వర్కర్స్ కి ఉద్యోగ భద్రత లేకుండా అభద్రతతో జీవిస్తున్నారని తెలిపారు. స్కీం వర్కర్స్ కు కనీసం బీమా సౌకర్యం కూడా కల్పించడం లేదని పని సమయంలో ప్రమాదాలు జరిగితే ఆదుకునే నాధుడు లేరని, ఇకనైనా ప్రభుత్వం భీమా సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులపై కుట్రతో ప్రభుత్వం జీవో నెంబర్ 282 తీసుకువచ్చి ఎనిమిది గంటల పని నుండి 10 గంటలకు పెంచిందని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాలు కార్మికుల రెక్కల కష్టాన్ని దోచుకునేందుకు పనిగంటలు పెంచారని తెలిపారు.
ఈ 282 జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేసి బడ్జెట్ ని వేరే రంగాలకు కేటాయింపులు చేస్తున్నారని కార్మికులు పనిచేసిన పని దినాలకు వేతనాలు సక్రమంగా చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ లో కొత్త జాబ్ కార్డులు పెంచకపోగా అవే పని దినాలని కొనసాగిస్తున్నారు. ఇకనైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తన విధానాన్ని మార్చుకోకపోతే కార్మికులతో నిర్విరామ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ కంబాలపల్లి కొండయ్య, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి బచ్చల కృష్ణ బాబు, నాయకులు యాలం శాంతకుమారి, ఎట్టి సరిత, నల్లబోయిన దేవి, సత్యవతి, దుబ్బ దేవమ్మ, సాయం కుమారి, తోలే ముత్తయ్య, బలుసుపాటి నరేష్ తదితరులు పాల్గొన్నారు.