సిరాజ్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం

10-07-2024 12:34:32 AM

ప్రపంచ చాంపియన్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందన

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడని.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన పేసర్ సిరాజ్.. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సిరాజ్‌ను సీఎం ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిరాజ్‌కు ఇంటి స్థలంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కేటాయించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ నగరంలో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని గుర్తించాలని.. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంచలంచెలుగా ఎదుగుతూ.. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న సిరాజ్ యువతరానికి స్ఫూర్తి అని సీఎం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, టీమిండియా మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.