06-11-2025 12:00:00 AM
లక్నో, నవంబర్5: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మిర్జాపూర్ చునార్ జంక్షన్‌లో దారుణం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు మహిళా భక్తులు స్టేషన్ నుంచి బయటకు వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీ కొట్టింది.ఈ ఘటనలో ఆరుగురు మహిళా భక్తులు దుర్మరణం చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.మృతులు గంగానదిలో పవిత్ర స్నానాలు ఆచరించడానికి చోపాన్ ప్రాంతం నుంచి వారణాసికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. వారు ప్యాసింజర్ రైలులో చునార్ రైల్వేస్టేషన్‌కి చేరుకొని పట్టాలు దాటుతుండగా వారిని హోరా నేతాజీ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందా లను ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం యోగి ఆదేశించారు.