08-11-2025 12:13:17 AM
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : పోలవరం లింకు ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతి లేకుండా ప్రాజెక్టు విస్తరించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. హైదరాబాద్‌లోని మసాబ్ ట్యాంక్ కేజీబీఓ కార్యాలయంలో శుక్రవారం 17వ పొలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) సమావేశం నిర్వహించారు. పీపీఏ సీఈవో అతుల్ జైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర జలశాఖ, జలశక్తి మంత్రిత్వశాఖ అధికారులు ఆన్‌లైన్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. బనకచర్ల ప్రాజెక్టు పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి లేకుండా టన్నెళ్లు, కాలువలను విస్తరించిందని ఆరోపించింది. తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్విన్ టన్నెళ్ల సామర్థ్యాన్ని 20,000 నుంచి 40,000 క్యూసెక్కులకు, రైట్ మెయిన్ కాలువను 10,000 నుంచి 17,548 క్యూసెక్కులకు పెంచిందని తెలిపారు.
ఈ విస్తరణలు కేంద్ర అనుమతి లేకుండా జరిగాయన్నారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఎన్ని లేఖలు రాసినా మార్పు లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి అనుమతిలేని పనులు కొనసాగకుండా పీపీఏ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ భాగంగా 41.15 మీటర్ల వరకు నీరు నింపితే భద్రాచలం సమీపంలోని ఎటపాక ఔట్ ఫాల్ రెగ్యులేటర్ నీటిలో మునిగిపోతుందని తెలంగాణ అధికారులు వివరించారు.
దీనివల్ల పట్టణంలో నీరు నిలిచిపోయే అవకాశం ఉందని, నిరంతర పంపింగ్ అవసరమని సూచించారు. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ కేంద్ర అనుమతులు లేకుండా విస్తరించిందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. ఇది టీఏసీ ఆమోదాలకు విరుద్ధమని పేర్కొంది. పీపీఏ సీఈవో అతుల్ జైన్ ఈ అంశంపై స్పందిస్తూ ఆంధ్ర సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని సూచించగా, తెలంగాణ అంగీకరించింది. రెండు రాష్ట్రాలు సమన్వయంతో పని చేయాలని, జాయింట్ కమిటీ త్వరగా నివేదిక సమర్పించాలని అతుల్ జైన్ సూచించారు.
బనకచర్ల డీపీఆర్ టెండర్లు రద్దు
పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు ఏపీ సర్కార్ అధికారికంగా వెబ్‌సైట్‌లో వెల్లడించింది. అక్టోబర్ 8న టెండర్లు ఆహ్వానించిన ప్రభుత్వం.. అక్టోబర్ 22 వరకు టెండర్లకు గడువుగా నిర్ణయించింది. అదే రోజు నుంచి సంస్థలకు టెండర్ డాక్యుమెంట్ అందుబాటులో ఉంచింది. టెండర్ డిపాజిట్‌ను రూ.7.75 లక్షలుగా వెల్లడించిన ఏపీ ప్రభుత్వం.. పని విలువను రూ.9.2 కోట్లుగా పేర్కొంది. అయితే.. టెండర్లపై కాంట్రాక్టర్లు ఆసక్తి చూపలేదని.. దాంతో వాటిని ప్రభుత్వం రద్దుచేసిందని తెలుస్తోంది. మరోసారి టెండర్లను పిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.