calender_icon.png 30 January, 2026 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నైపుణ్యమే ఉద్యోగాలకు కీలకం!

30-01-2026 12:00:00 AM

కపిలవాయి దిలీప్‌కుమార్ :

దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు కావొస్తున్నా నేటికి విద్యార్థులు సరైన ఉద్యోగాలు సాధించడంలో విఫలమవుతున్నారు. దేశాభివృద్ధికి తోడ్పడాలంటే వారికి ఎలాంటి శిక్షణ అందించాలనే దానిపై స్పష్టత లేదు. దేశంలో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులు చదివిన ఎంతో మంది చివరకు సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకుని ఆ రంగంలో స్థిరపడుతున్నారు. మన విద్యా వ్యవస్థలో గందరగోళానికి ఇదొక నిదర్శ నం.

నైపుణ్యాభివృద్ధికి గత దశాబ్ద కాలంగా ప్రభుత్వాలు దృష్టి సారించిన ప్రణాళికలకు, ఆచరణలకు మధ్య లోపాలు కనిపిస్తు న్నాయి. భారతదేశ ప్రగతి ప్రస్థానాన్ని ఉపాధి రహిత అభివృద్ధిగా ఆర్ధికవేత్తలు అభివర్ణిస్తున్నారు. భారతీయ పట్టభద్రుల్లో సగం మందే ఉద్యోగాలు సంపాదించే నైపుణ్యాలు కలిగి ఉన్నారని, 2023 స్కిల్ ఇండి యా నివేదిక వెల్లడించింది. భారత్‌లో ప్రతి నలుగురు ఎంబీఏ పట్టభద్రుల్లో ఒకరు, ప్రతి ఐదుగురు ఇంజనీర్లలో ఒకరు మాత్ర మే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు కలిగి ఉన్నట్లు ప్రపంచ ఆర్థిక నివేదిక గతంలోనే వెల్లడించింది.

భారతీయ కార్మికుల్లో కేవలం 4.69 శాతం మాత్రమే సంఘటిత మార్గంలో నైపుణ్య శిక్షణను పొందారు. అదే దక్షిణ కొరియాలో ఇది ఏకంగా 96 శాతం, జపాన్ 80 శాతం, జర్మనీ 75 శాతం, బ్రిటన్ 68 శాతం, అమెరికా 52 శాతం, చైనాలో 64 శాతంతో మనకంటే మెరుగ్గా ఉన్నాయి.  జాతీయ నైపుణ్యాభివృద్ధి మండలి, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖల పరిధిలో వృత్తివిద్యా కోర్సులను నేర్పే వ్యవస్థలోనే లోపాలుండడం శోచనీయం.

చదివిందొకటి.. చేసేదొకటి..

యువశక్తులను నైపుణ్య మానవ వనరులుగా తీర్చిదిద్దడంలో పాలకుల నిర్లక్ష్యం దశాబ్దాలుగా దేశానికి శాపంగా మారింది. జర్మనీ, యూకే, చైనా లాంటి దేశాలు పాఠశాల స్థాయిలోనే వృత్తివిద్యకు పెద్ద పీట వేస్తున్నాయి. చైనాలో శ్రామిక శక్తిలో అప్రెంటిస్‌షిప్ రూపేణా ఉద్యోగ శిక్షణ పొందిన వారి సంఖ్య 2 కోట్లు కాగా జపాన్‌లో ఈ సంఖ్య కోటికి పైగా ఉంది. కానీ 140 కోట్ల జనాభా కలిగిన భారత్‌లో మాత్రం అప్రెంటిస్‌షిప్‌ల సంఖ్య 10 లక్షలలోపే ఉంది.

తమ విద్యార్హతలకు ఏమాత్రం పొంతనలేని కొలువులు చేస్తూ అరకొర వేతనాలతో సర్దుకుపోతున్నారు. ప్రతి ఏటా డిగ్రీలు పట్టుకొని బయటకు వచ్చే వారిలో పారిశ్రామిక అవసరాల కోసం పనికొచ్చేవారు కేవలం 45 శాతం మంది మాత్రమే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు నైపుణ్య గణన చేపట్టాల్సిన అవసరముంది.- ఆధునిక ప్రపంచంలో విద్యా నైపు ణ్యాలకు ఎంతో ప్రాధాన్యమున్నది.

శ్రామిక శక్తిని, వ్యక్తుల సామర్థ్యాలను సమర్ధంగా వినియోగించుకోవడానికి అభివృద్ధిని పరుగులు తీయించడానికి నైపుణ్యాలే కీలకం. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థకు అవసరమైన గీటురాయిని అందుకోవాలంటే మన జనాభా లో ఉన్న నైపుణ్యాలను సమర్థంగా అంచనా వేయగలగాలి. శ్రామిక శక్తి నైపుణ్యాలు, సామర్ధ్యాల గురించి సమగ్ర సమాచారం సేకరించడం వల్ల విధాన రూపకర్తలు సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఆధునిక కాలానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను రూపొందించి అమలు చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.

వివిధ పరిశ్రమల్లో ప్రస్తుత ధోరణులను విశ్లేషించడానికి, దాని కి అనుగుణంగా పాఠ్యాంశాలను, శిక్షణా కార్యక్రమాలను రూపొందించడానికి నైపుణ్య గణన దోహదపడుతుంది. వ్యక్తు ల్లో విజ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధిని ప్రోత్సహించే సమగ్ర కార్యక్రమాన్ని సింగపూర్ స్కిల్స్ ఫ్యూచర్ పేరుతో సమగ్రంగా అమ లు చేస్తోంది. మరోవైపు తరగతి విద్యను నైపుణ్య శిక్షణకు అనుసంధానించి ఈ కార్యక్రమం ద్వారా ప్రస్తుతం ప్రపంచంలో ఉత్త మ విద్యను అందించే దేశంగా జర్మనీ నిలిచింది. దీనివల్ల జర్మనీ అతి తక్కువ నిరుద్యో గ రేటుతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. 

బట్టీ విధానం వీడాలి..

నాలుగు గోడల మధ్య పాఠ్యపుస్తకాల చదువుకు కాలం చెల్లింది. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు క్షేత్రస్థాయిలో ప్రయోగా త్మక నైపుణ్యం కలిగిన విద్య అనివార్యమైం ది. నిత్యజీవితంలో ఎదురయ్యే సవాళ్లను -పరిష్కరించే నూతన ఆవిష్కరణలకే సంస్థ లు మొగ్గు చూపుతున్నాయి. భారత్‌లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. దేశంలో ఇప్పటికీ బట్టీ చదువుల విధానమే ఎక్కువగా కొనసాగుతున్నది. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పిల్లలు సాధించే మార్కులకే పరిమితం అవుతున్నారు.

కానీ పిల్లల్లో నైపుణ్యాలు ఎంత మేర పెరిగాయన్నది పట్టిం చుకోవడం లేదు. పరీక్షలు తూతూ మం త్రంగానే నిర్వహిస్తున్నారు. పిల్లలు సొంత మాటల్లో సమాధానం రాస్తే వాటిని విశ్లేషించే ఓపిక, తీరిక ఉపాధ్యాయులకు ఉండ టం లేదు. పరీక్షలకు ఒక బ్లూ ప్రింట్‌ను తయారు చేసి, అందులో నుంచి జవాబు లు రాస్తేనే మార్కులు వేయడమన్నది పరిపాటిగా మారిపోయింది. ఈ ధోరణి వల్ల పిల్లలు నేర్చుకునే శక్తిని కోల్పోవడమే కాకుండా ఆలోచనాశక్తిని, సృజనాత్మకతను పూర్తిగా చంపేస్తుంది. ఇప్పటికైనా బట్టీ విధానాన్ని వీడాలి. 

చదువు పూర్తవ్వగానే ఉద్యోగాలు రావాలంటే పాఠశాల స్థాయి నుంచే ప్రాజెక్టు ఆధారిత అభ్యాసన విజ్ఞానాన్ని ప్రవేశపెట్టా లి. జపాన్‌లో 92 శాతం పట్టభద్రులు చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు సంపాదిస్తున్నారంటే అక్కడ ప్రవేశపె ట్టిన పీబీఎల్ పద్దతి వల్లే సాధ్యమవుతుంది. అదే విధంగా బ్రిటన్‌లో 15 శాతం, అమెరికాలో 24 శాతం, చైనాలో 72 శాతం మం ది చదువు పూర్తి కాగానే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. కానీ భారత్‌లో మాత్రం ఇప్ప టికీ విద్యలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కష్టంగా ఉన్నది. 

సామర్థ్యం పెరగాలి..

తెలంగాణ రాష్ర్టంలోని డిగ్రీ కాలేజీల్లో కొత్తగా ప్రారంభిస్తున్న స్కిల్ కోర్సులకు యాజమాన్యాల నుంచి స్పందన కరువైం ది. ఈ కోర్సులు అందించేందుకు ప్రైవేట్ తో పాటు ప్రభుత్వ కాలేజీలు కూడా ముందుకు రావడం లేదు. స్కిల్ కోర్సుల్లో చేరితే నెలకు రూ. 10 వేలు ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ప్రోత్సాహకం లభించే అవకాశముంది. కానీ ఈ కోర్సుల్లో చేరితే పై చదువులకు ఇబ్బంది అవుతుందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నా యి.

ఈ కారణంతో ఉన్నత విద్యామండలి ఎంపిక చేసిన కాలేజీలు కూడా ఈ కోర్సు లు అందించేందుకు ముందుకు రావడం లేదు. విద్యార్థుల నైపుణ్య నిర్మాణంలో గురువుల పాత్ర కీలకం.ఆధునిక శాస్త్రాల అవసరాలకు తగ్గట్టు పాఠ్యంశాల కూర్పు, బోధన సిబ్బందికి నిరంతర శిక్షణలతో దక్షిణ కొరియా, సింగపూర్, హాంకాంగ్, ఫిన్లాండ్ దేశాలు ఆదర్శంగా ఉన్నాయి. మన దేశంలో కూడా మానవ వనరులు నైపుణ్యాభివృద్ధి సాధించాలంటే బోధనా సిబ్బంది సామర్థాలను పెంచాలి.

అధ్యాపకులు తాము చేసే పనిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కొత్త విషయాలను నేర్చుకోవాలి. కానీ 90 శాతం మంది భార త వృత్తి నిపుణులు అందుకు పూర్తిస్థాయి లో సిద్ధం కావడం లేదు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక సమస్యలు, బిజీ షెడ్యూల్ తదితర కారణాలతో వెనుకడుగు వేస్తున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. 

2030 నాటికి ప్రపంచ స్థాయిలోనే కాకుండా భారత్‌లోనూ ప్రస్తుతమున్న ఉద్యోగ బాధ్యతలు, విధుల స్వరూపం 64 శాతం మేర మారిపోయే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వృత్తి నిపుణులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను తప్పని సరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తాము చేసే పని పద్ధతులు విధానాల్లో మార్పులపై దృష్టి కేంద్రీకరించాలి. దీనికి పాఠశాల స్థాయిలోనే వృత్తి విద్యను పాఠ్యాంశంగా బోధించాలి. ఉపాధికి కీలకమైన నైపుణ్యాలతో పాటు నైతిక విలువలు, సామాజిక బంధాలు, నిర్వహణ, నాయకత్వ సామ ర్థ్యం లాంటివి మొగ్గ దశ నుంచే విద్యార్థులకు ఒంట బట్టించడం కీలకం. 

 వ్యాసకర్త సెల్: 9963027577