calender_icon.png 30 January, 2026 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాఫియాను అరికడదాం!

30-01-2026 12:00:00 AM

వెంకగారి భూమయ్య :

ఒకవైపు కార్పొరేట్ మాఫియాను తిడుతూనే, మరోవైపు వారికి సకల సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వానికే చెల్లిందనడంలో అతిశయోక్తి లేదు. ఈ రాజకీయ నాటకాలకు స్వస్తి పలికి, విద్యార్థుల ప్రాణాలకు విలువిచ్చేలా స్పష్టమైన విద్యా విధానాన్ని అమలు చేయాలి. లేదంటే, రాబోయే రోజుల్లో ఈ గందరగోళం విద్యా వ్యవస్థను పూర్తిగా అగాధంలోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. 

తెలంగాణ విద్యారంగం నేడు కార్పొరేట్ విద్యా రాబందుల కబందహ స్తాల్లో చిక్కుకొని విలవిల్లాడుతోంది. విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే, పాలకులు మాత్రం కేవలం ప్రసంగాలకే పరిమితమవుతున్నారు. ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ర్టంలోని విద్యా వ్యవస్థ వైకల్యాన్ని బట్టబయలు చేయడమే కాకుండా, ప్రభుత్వ అసమర్థతను కళ్లకు కడుతున్నాయి. ‘నాకు విద్యాశాఖ మంత్రిగా ఛాన్స్ వస్తే కార్పొరేట్ స్కూల్స్ అన్నింటినీ మూసేయిస్తా’ అని ఆయన అనడం బాగానే ఉన్నప్పటికీ, ఇది ముమ్మాటికీ బాధ్యతల నుంచి పలాయనం చిత్తగించడమే అవుతుంది.

ఒక కేబినెట్ మం త్రి హోదాలో విద్యా వ్యవస్థలో దారుణాలు జరుగుతున్నాయని తెలిసినప్పటికీ శాఖ మారితేనే తాను పని చేస్తానని చెప్పడంలో ఆంతర్యమేమిటన్నది అంతుచిక్కడం లేదు. ప్రభుత్వ పాలన అనేది ఒక సమిష్టి బాధ్యత. ఒక మంత్రిగా సమస్య తెలిసినప్పుడు క్యాబినెట్‌లో గట్టిగా నిలదీయాల్సింది పోయి కేవ లం పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రకటనలు చేయడం ఆయన రాజకీయ అసహాయత ను, పదవీ కాంక్షను బహిర్గతం చేస్తున్నది.

ఇక రాష్ర్టంలో నారాయణ, శ్రీచైతన్య వంటి విద్యా వ్యాపార సామ్రాజ్యాలు విద్యార్థుల రక్తాన్ని ఫీజుల రూపంలో జుర్రుకుంటున్నాయన్నది బహిరంగ రహస్యం. మంత్రి  అన్న ట్లుగా ‘బట్టీ’ పద్ధతి అనేది విద్యార్థుల మేధస్సును గొంతు నులిమి చంపేసే ఒక నెమ్మ దైన విషప్రయోగం.

లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, పశువుల పాకల వంటి గదుల్లో విద్యార్థులను బంధించి, కేవలం ర్యాంకుల కోసం వారిని ఆత్మహత్య ల వైపు ప్రేరేపిస్తుంటే సర్కారు ఎందుకు నిద్రపోతోంది? ఏటా పదుల సంఖ్యలో విద్యార్థులు ఫ్యాన్లకు ఉరితాళ్లతో వేలాడుతు న్నా, అవే సంస్థలకు ప్రభుత్వం ఏటా అనుమతులు ఎలా మంజూరు చేస్తోందన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఒకవైపు ఆ సంస్థల యజమానులను దొంగలతో పోల్చి న మంత్రి, అదే సమయంలో ప్రభుత్వం వా రికి ఎందుకు వత్తాసు పలుకుతుందో సమాధానం చెప్పాల్సిన అవసరముంది.

మేధావుల వెట్టిచాకిరీ.. 

పీహెచ్‌డీలు చేసిన మేధావులు కూడా ఉద్యోగాలు లేక ఈ నరకకూపాల్లో వెట్టిచాకి రీ చేస్తున్నారంటే, అది ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోవడమే అని చెప్పొచ్చు. అంతేకాదు విద్యా రంగంలో ఉపాధిని కల్పించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ప్రభుత్వం తన పరిధిలోని లెక్చరర్ పోస్టులను భర్తీ చేయకుండా, ఉన్నత విద్యావంతులను కార్పొరేట్ రాబందుల చేతికి చిక్కేలా చేస్తోంది.

ఒకవైపు ప్రభుత్వం ‘మన ఊరు బడి’ వంటి పథకాలతో గొప్పలు చెప్పుకుంటూనే, మరోవైపు కార్పొరేట్ సంస్థల ఫీజుల దోపిడీని అదుపు చేయడానికి కనీసం ఒక్క జీవో కూ డా జారీ చేయలేక చేతులెత్తేస్తోంది. మంత్రి తన సొంత నిధులతో ఒక మోడల్ స్కూల్ కట్టినంత మాత్రాన రాష్ర్టంలోని లక్షలాది మంది పేద విద్యార్థుల సమస్య తీరిపోదు. అది కేవలం ఒక వ్యక్తిగత ఇమేజ్ కోసం చేసే ప్రయత్నం తప్ప, విధానపరమైన మార్పును తీసుకురాదన్న విషయం గుర్తించాలి.

పాలనలో గందరగోళం..

కార్పొరేట్ సంస్థలకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ‘అపవిత్ర పొత్తు’ వల్లనే ఇలాం టి గందరగోళ ప్రకటనలు బయటకు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో విరాళాలు ఇచ్చే కార్పొరేట్ శక్తుల మెడలు వంచే ధైర్యం పాలకులకు లేనట్లుగా అనిపిస్తున్నది. అం దుకే ఇలాంటి మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నారు. ప్రభుత్వమే స్వయంగా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకా స్తూ, ప్రజల ముందు నీతులు వల్లించడం అత్యంత సిగ్గుచేటు.

అంతేకాదు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు ప్రభుత్వంలోని అంతర్గత విభేదాలను కూడా బయటపెడుతున్నాయనిపిస్తున్నది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి సమర్థుడు కాదని సదరు మంత్రి భావిస్తున్నారా? లేక ముఖ్యమంత్రి నాయకత్వం లో విద్యా వ్యవస్థ బాగుపడదన్న నమ్మ కం ఆయనకు పోయిందా అన్నది తెలియాల్సి ఉంది.

అసలు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడమే సమస్యకు పరిష్కారం అనుకుంటే, అలాంటప్పుడు ప్రస్తుత క్యాబినెట్‌లోని విద్యాశాఖ నిర్వహణలో ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని మంత్రి పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా! ఒక పక్క ప్రభుత్వ కాలేజీల్లో కనీసం ల్యాబ్ సౌకర్యా లు లేక, టాయిలెట్లు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతుంటే, వాటిని బాగు చేయడాన్ని పక్కనబెట్టేసిన పాలకులు కార్పొరేట్ స్కూళ్ల ను మూసేస్తామని చెప్పడం కేవలం రాజకీయ విన్యాసం కిందకే వస్తుంది.

కార్పొరేట్ స్కూళ్ల మూసివేత అనేది ఒక ప్రత్యామ్నాయం కాదు, అది కేవలం తమ అసమ ర్థతను కప్పిపుచ్చుకునే సాకులా అనిపిస్తుం ది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుం డా ప్రైవేట్ సంస్థలను తిట్టడం అంటే.. చేతు లు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుం ది. ఈ ప్రకటనల వెనుక ఉన్న అసలు ఉద్దే శం విద్యా రంగం మీద ప్రేమ కాదు, ప్రజల దృష్టిని మళ్ళించే ఎత్తుగడ మాత్రమే అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది.

స్పష్టమైన విద్యా విధానం..

ఈ అస్పష్టత వల్ల అటు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు భరించలేక, ఇటు ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకం లేక రెంటికీ చెడ్డ రేవడిలా మారుతున్నారు. ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరిని వీడితే తప్ప ఈ విద్యా వైకల్యం నుంచి రాష్ట్రానికి విముక్తి లభించదు. ఒకవైపు కార్పొరేట్ మాఫియాను తిడుతూనే, మరోవైపు వారికి సకల సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వానికే చెల్లింద నడంలో అతిశయోక్తి లేదు. ఈ రాజకీయ నాటకాలకు స్వస్తి పలికి, విద్యార్థుల ప్రాణాలకు విలువిచ్చేలా స్పష్టమైన విద్యా విధా నాన్ని అమలు చేయాలి.

లేదంటే, రాబో యే రోజుల్లో ఈ గందరగోళం విద్యా వ్యవస్థను పూర్తిగా అగాధంలోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. మంత్రి వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటన్నది ప్రజలకు తెలుసు. అతనిది ఆవేదన కాదు.. కేవలం తన రాజకీయ ఉనికిని చాటుకునే ప్రయత్నం మాత్రమే అని. ఇప్పటికైనా కార్పొరేట్ స్కూళ్లకు వంత పాడ డం ఆపేసి విద్యా మాఫియాను అరికట్టేందుకు ప్రభుత్వం నడుం బిగించాల్సిన అవసరముంది. 

 వ్యాసకర్త సెల్: 9848559863