22-11-2025 01:12:42 AM
నాగర్ కర్నూల్ నవంబర్ 21 (విజయక్రాంతి ): నాగర్ కర్నూలు జిల్లా దుందుభి వాగు పరిసర ప్రాంతాల్లో నిత్యం జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను నిలువరించాలని డిమాండ్ చేస్తూ ఉప్పునుంతల మండల తాసిల్దార్ సునీతకు వినతి పత్రం అందించారు. పట్టా భూమికి మాత్ర మే పర్మిషన్ ఉన్నా, దుందుబి వాగులో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా యని అచ్చంపేట ఇంచార్జ్ ఉల్పర కృపానందం, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్, మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ తీవ్రంగా ఖండించారు.
రోజుకు 15 టిప్పర్లకు మాత్రమే అనుమతి ఉండగా, రాత్రివేళల్లో 40--50 టిప్పర్లు ఇసుక తరలింపులు జరగడంపై అధికారులు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక హామీ అమలుకాలేదని, వాణిజ్య ప్రయోజనాల కోసం మాత్రమే భారీ రవాణా సాగుతుందని విమర్శించారు. అచ్చంపేట ఎమ్మెల్యే, జిల్లా ఎస్పీ, కలెక్టర్లు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, అవసరమైతే రాత్రివేళల్లో టిప్పర్లను అడ్డుకుంటామని హెచ్చరించారు.